అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి..
ABN , Publish Date - Jul 02 , 2026 | 03:24 AM
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారి బోయపాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో....
గుంటూరు జిల్లాలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం
లారీ క్యాబిన్లలోనే చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం
డీజిల్ అయిపోవడంతో.. మధ్యలో నిలిచిన లారీ
తప్పించబోయి డివైడర్ దాటి దూసుకెళ్లిన మరో లారీ
అదే వేగంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో మంటలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ వకుల్ జిందాల్
ప్రత్తిపాడు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండల పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారి బోయపాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. రోడ్డు మధ్యలో ఆగిన లారీని తప్పించబోయిన మరో లారీ.. అదే వేగంతో డివైడర్‌ను దాటి.. అవతలి వైపు వస్తున్న మరో లారీని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ గుర్తుపట్టలేని విధంగా సజీవ దహనమయ్యారు. వివరాలు.. బోయపాలెం సమీపంలో డీజిల్ అయిపోవడంతో కోళ్ల దాణా లారీని రోడ్డు మధ్యలోనే నిలిపి ఉంచారు. అదే మార్గంలో నంద్యాల జిల్లా బేతంచర్ల నుంచి మచిలీపట్నానికి నాపరాయి లోడుతో వేగంగా వస్తున్న లారీ.. కోళ్ల దాణా లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. అదే వేగంతో అవతలి రోడ్డులో భద్రాచలం నుంచి బెంగళూరుకు పేపర్ బండిల్స్ తీసుకెళ్తున్న లారీని ఢీకొంది. ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి నాపరాయి లారీ డ్రైవర్, నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం నేరేడుచర్ల గ్రామానికి చెందిన మేకల రవికుమార్ (36), అదే గ్రామానికి చెందిన క్లీనరు రమేష్ (35) సజీవ దహన మయ్యారు. అలాగే పేపర్ బండిల్స్ లారీ డ్రైవర్, కర్ణాటకలోని కోలార్ జిల్లా శెట్టిగన్‌పల్లి గ్రామానికి చెందిన ధర్మపతి (26) కూడా ఆ మంటలకు ఆహుతయ్యాడు. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా మారిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సాయంతో మంటల్ని అదుపు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ నరహరి ఎక్స్‌కవేటర్ సాయంతో లారీలను వేరు చేసి, మృతదేహాలను గుంటూరు నుంచి కొవిడ్ పైటర్స్ ద్వారా బయటకు తీయించారు. ప్రమాద స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు.
