గుంటూరు క్యాన్సర్ ఆస్పత్రి భేష్!
ABN , Publish Date - May 15 , 2026 | 04:19 AM
దేశంలోనే లెవల్-1 స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది క్యాన్సర్ సెంటర్లలో ఒకటిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ..
లెవల్-1 స్థాయిలో నాట్కో క్యాన్సర్ సెంటర్‌కు గుర్తింపు
అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమ వైద్యం
మహమ్మారి కట్టడికి 4 కోట్ల మందికి పరీక్షలు
మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
జీజీహెచ్‌లో పెట్ స్కాన్ యూనిట్ ప్రారంభం
గుంటూరు మెడికల్, మే 14 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే లెవల్-1 స్థాయి గుర్తింపు పొందిన అతి కొద్ది క్యాన్సర్ సెంటర్లలో ఒకటిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి నాట్కో క్యాన్సర్ సెంటర్ నిలిచిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గురువారం గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో రూ.18 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ (పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) యంత్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలసి మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. సత్యకుమార్ మాట్లాడుతూ పెట్ స్కాన్, లీనాక్, హెచ్‌ఏఆర్, సీటీ స్టిమ్యులేటర్, సీటీ, ఎంఆర్‌ఐ వంటి అత్యాధునిక పరికరాలతో పూర్తి స్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రంగా గుంటూరు జీజీహెచ్ ఎదిగిందని చెప్పారు. సీఎస్ఆర్ పథకం కింద ఓఎన్‌జీసీ కంపెనీ స్థానిక జీజీహెచ్‌కు రూ.30 కోట్లతో మరో లీనాక్ మెషిన్‌తో పాటు ఇతర పరికరాలు అందజేసేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధి కట్టడికి దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 4.10 కోట్ల మందికి ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది అనంతపురం, కాకినాడ ప్రభుత్వాస్పత్రులను సమగ్ర క్యాన్సర్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి పథంలో గుంటూరు జీజీహెచ్: పెమ్మసాని
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల వ్యవధిలో గుంటూరు జీజీహెచ్‌లో రూ.140 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో రూ.71 కోట్లు సీఎస్ఆర్ ఫండ్ కాగా, రూ.51 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, దాతలు అందజేసినట్లు తెలిపారు. జింకానాకు చెందిన ఎన్నారై వైద్యులు మరో రూ.100 కోట్లతో 600 పడకలతో తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాన్ని జీజీహెచ్‌లో నిర్మించినట్లు తెలిపారు. రెండేళ్లల్లో అదనంగా 800 పడకలు సమకూరాయని చెప్పారు. పెట్ స్కాన్, లీనాక్ మెషిన్‌లతో నాట్కో క్యాన్సర్ సెంటర్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో వైద్యం అందుబాట్లోకి వచ్చిందన్నారు. ఎయిమ్స్‌తో సహా ఇతర ప్రభుత్వ రంగ వైద్యశాలల్లో పెట్ స్కాన్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వరకు ఫీజు వసూలు చేస్తున్నా, గుంటూరు జీజీహెచ్‌లో మాత్రం పెట్‌స్కాన్ పరీక్షను ఉచితంగానే చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీఎంఈ డాక్టర్ రాధిక రెడ్డి, నాట్కో వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ వ్యవహారాలు) నన్నపనేని సదాశివరావు, పాల్గొన్నారు.