రోగికి అవేక్ బైపాస్ సర్జరీ
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:47 AM
గుండెకు బైపాస్ ఆపరేషన్ చేసే సమయంలో రోగికి జనరల్ ఎనస్తీషియా ఇస్తారు. దీని వల్ల రోగికి స్పృహ ఉండదు. ఆపరేషన్ ఎప్పుడు చేసింది, ఎప్పుడు ముగిసింది..
రమేశ్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్
రోగి మెలకువగా ఉండగానే శస్త్రచికిత్స చేయడం జిల్లాలో ఇదే తొలిసారి: డాక్టర్ రమేశ్
గుంటూరు మెడికల్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): గుండెకు బైపాస్ ఆపరేషన్ చేసే సమయంలో రోగికి జనరల్ ఎనస్తీషియా ఇస్తారు. దీని వల్ల రోగికి స్పృహ ఉండదు. ఆపరేషన్ ఎప్పుడు చేసింది, ఎప్పుడు ముగిసింది అన్న విషయాలు తెలియవు. కానీ గుంటూరు జిల్లాలో తొలిసారిగా ఆస్టర్ రమేశ్ ఆసుపత్రిలో హైరిస్క్ రోగికి బైపాస్ ఆపరేషన్‌ను మత్తు ఇవ్వకుండా చేశారు. వైద్యులు సర్జికల్ బ్లేడ్‌తో తన హృదయం తెరవడం, రక్తనాళాలు అతికించడం, తిరిగి ఛాతి మూయడం వంటివి రోగి మెలకువలోనే ఉండి చూడటం గమనార్హం. జిల్లాలో ఈ తరహా హార్ట్ సర్జరీ చేయడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. శనివారం ఆసుపత్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు ఈ కేసు వివరాలను తెలిపారు. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 64 ఏళ్ల వృద్ధుడిలో మూడు గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటంతో ఆపరేషన్ కోసం రమేశ్ ఆసుపత్రికి వచ్చారు. ఆయనకు ఏడేళ్ల కిందట క్యాన్సర్ సోకడంతో కుడి ఊపిరితిత్తిని తొలగించారు. రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. దీంతో బైపాస్ ఆపరేషన్ కోసం మత్తు మందు ఇవ్వడం అత్యంత ప్రమాదకంగా మారుతుందని వైద్యులు భావించారు. రోగి ఆరోగ్య స్థితిని దృష్టిలో ఉంచుకొని గుండె శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ జయరాం పాయ్, కార్డియాక్ అనస్తీషియా వైద్యులు డాక్టర్ లోగనాథన్ ఆధ్వర్యంలో సాధారణ మత్తు ఇవ్వకుండా అపిడ్యూరల్ ఎనస్తీషియా ఇచ్చి రోగి మెలకువగా ఉన్నప్పుడే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 2న విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నారని రమేశ్ బాబు తెలిపారు. అరుదైన ఆపరేషన్ నిర్వహించిన వైద్య బృందాన్ని ఎండీ డాక్టర్ రమేశ్‌బాబు అభినందించారు.