ఆ సర్జన్లకు గుండె ధైర్యం ఎక్కువే!
ABN , Publish Date - May 12 , 2026 | 05:09 AM
ప్రైవేటు వైద్య రంగంలో దిగ్గజాల వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు సాధ్యం కాని రికార్డును గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సాధించింది.
రెండేళ్లలో విజయవంతంగా 225 సంక్లిష్ట గుండె శస్త్ర చికిత్సలు
కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులన్నీగుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికే...
గుంటూరు మెడికల్, మే 11(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు వైద్య రంగంలో దిగ్గజాల వంటి కార్పొరేట్ ఆసుపత్రులకు సాధ్యం కాని రికార్డును గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సాధించింది. రెండేళ్ల వ్యవధిలో ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 225 గుండె శస్త్ర చికిత్సలను(ఓపెన్ హార్ట్ కార్డియాక్ సర్జరీలు) విజయవంతంగా నిర్వహించింది. వీటిలో బైపాస్, కవాట మార్పిడి(వాల్వ్ రీప్లే్‌సమెంట్) వంటి క్ల్లిష్టమైన శస్త్ర చికి త్సలు ఉన్నాయి. మెజారిటీ కేసులు వివిధ కారణాలతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు తిరస్కరించినవే. అన్నీ హైరిస్క్ కేసులే. చివరి ఆశగా వారంతా జీజీహెచ్‌ను ఆశ్రయించారు. ‘వైద్యో నారాయణో హరి...’ ఆర్యోక్తికి ప్రతీకలుగా నిలిచిన ప్రభుత్వాసుపత్రి కార్డియోథొరాసిక్ శస్త్ర చికిత్స వైద్య బృందంలోని డాక్టర్లు హరికృష్ణ, కుప్పుస్వామి, యోగి సుందరరావు..‘మేమున్నాం..శక్తివంచన లేకుండా మీ ప్రాణాలను కాపాడడానికి కృషి చేస్తాం’ అంటూ ముందుకు వచ్చారు. వీరికి తోడుగా నిలిచి, కేసులు విజయవంతం చేయడానికి విశేషంగా కృషి చేసిన మత్తు మందు విభాగాధిపతి డాక్టర్ పోలయ్య, ఆయన సహచర వైద్య బృందం సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. గత వారం మూడు హైరిస్క్ కేసుల్లో ఇద్దరికి బైపా్‌స(సీఏబీజీ) చేయగా... ఒకరికి కవాట మార్చిడి శస్త్ర చికిత్సను జీజీహెచ్‌లో విజయవంతంగా నిర్వహించారు.
బడా ఆసుపత్రులు ఎందుకు చేయడం లేదు?
సాధారణంగా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు ఎన్నో చేస్తుంటాయి. అవే కేసులు ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద అయితే ససేమిరా అంటూ నిరాకరిస్తున్నాయి. ఎందుకు ఇలా? అన్న ప్రశ్నకు సీటీఎస్ విభాగాధిపతి డాక్టర్ హరికృష్ణ సమాధానం చెపుతూ... ‘కవాటాల మార్పిడి ఆపరేషన్‌నే ఉదాహరణగా తీసుకొంటే.. దీనికి ప్రైవేటు వైద్యశాలలే ముందుగా రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టాలి. కవాటాన్ని కొనుగోలు చేయాలి. ఒకవేళ ఆపరేషన్ విఫలమై రోగి మరణిస్తే... ట్రస్టు నిపుణులు విచారణ జరిపిస్తారు. అది పూర్తయ్యే వరకూ ఆపరేషన్ డబ్బులు రావు. అంతేకాదు రోగి మరణిస్తే ఆసుపత్రికి చెడ్డ పేరు వస్తుందేమో అన్న భయం కూడా వైద్యులను వెంటాడుతుంది. అందుకే వాళ్లెవ్వరూ ముందుకు రారు. ఏ మాత్రం క్లిష్టమైన కేసు అనిపించినా వెంటనే ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సిఫారసు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇలాంటి కేసులను అత్యంత నైపుణ్యంతో నిర్వహించగలిగిన మత్తు వైద్యులు, కోరిన వైద్య పరికరాలను వెనువెంటనే సమకూర్చే సూపరింటెండెంట్ ఉండడంతో రెండేళ్లల్లో ఇన్ని కార్డియాక్ సర్జరీలను పూర్తి చేయగలిగాం. మా విభాగంలోనే ఏవీ ఫిస్టులా ఆపరేషన్లు (డయాలసిస్ కోసం), వాస్కులర్ సర్జరీలు కూడా చేస్తున్నాం’ అని వివరించారు. జీజీహెచ్ ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పోలయ్య మాట్లాడుతూ, ఈ విజయం వెనుక పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే అందించిన స్ఫూర్తి, ఆయన బృందం ఇచ్చిన శిక్షణ ఉందని తెలిపారు.
సవాల్‌గా తీసుకుని విజయవంతంగా ఆపరేషన్లు
‘2024 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకూ అంటే రెండేళ్ల కాలంలో జీజీహెచ్‌లో 225 ఓపెన్ హార్ట్ సర్జరీలను విజయవంతంగా చేయడం చిన్న విషయమేమీ కాదు’ అని సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తెలిపారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... ‘ఈ సంఖ్య మా వైద్య నిపుణుల నిబద్ధతతో కూడిన పని తీరుకు సూచిక. వీటిలో దాదాపు సగం పైగా కేసులు హైరి్‌స్కవే కావడం గమనార్హం. వాటిని సవాల్‌గా తీసుకొని విజయవంతంగా ఆపరేషన్లు చేయడం అసాధారణ విషయం. మా గుండె వైద్యులకు గుండె ధైర్యం ఎక్కువే. అందుకే ఏ మాత్రం తడబాటు లేకుండా హైరిస్క్ కేసులనూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు’ అని పేర్కొన్నారు.
- డాక్టర్ రమణ యశస్వి