గుంటూరు జీజీహెచ్ వెలవెల
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:55 AM
జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిపై ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.
భారీగా తగ్గిన రోగులు.. జూనియర్ డాక్టర్ల సమ్మె తీవ్రం
జనరల్ మెడిసిన్, సర్జరీ వార్డుల్లో 80శాతం పడకలు ఖాళీ
గుంటూరు మెడికల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రభావం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిపై ఈ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. 1800 పడకల సామర్థ్యంతో నిత్యం 120 ఆక్యుపెన్సీ రేటుతో (సుమారు 2,200 మంది రోగులతో) కిక్కిరిసి ఉండే గుంటూరు జీజీహెచ్ సమ్మె కారణంతో రోగులు లేక వెలవెలపోతోంది. జీజీహెచ్‌లో బుధవారం 1,290 ఇన్‌పేషెంట్ రోగులు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. గతంలో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వార్డుల్లో పడకలన్నీ రోగులతో నిండిపోయేవి. బెడ్లు సరిపోక రోగులను నేలపై ఉంచి చికిత్స అందించే పరిస్థితి ఉండేది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో ఈ రెండు విభాగాల్లో 80 శాతం పడకలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గైనకాలజీ, ఐసీయూ, ఎమర్జెన్సీ, ట్రామా, క్యాజువాల్టీ వంటి వార్డుల్లో మాత్రం రోగులు కొద్దిగా కనిపిస్తున్నారు. మిగిలిన వార్డుల్లో రోగుల సంఖ్య 60 నుంచి 70 శాతానికిపైగా తగ్గిపోయింది. రోజూ రెగ్యులర్ వైద్యులకు సాయంగా 500 మంది జూనియర్ డాక్టర్లు వైద్య సేవలు అందించేవారు. ప్రతిరోజూ 350-400 మంది వరకూ ఇక్కడ ఇన్‌పేషెంట్‌గా చేరుతుండగా.. జూనియర్ డాక్టర్ల గైర్హాజరు వల్ల బుధవారం 135 మంది రోగులను మాత్రమే అడ్మిట్ చేసుకున్నారు. ఓపీ కూడా 4 వేల నుంచి 2,583 మందికి తగ్గింది.
కళ్లకు గంతలతో నిరసన..
జూనియర్ డాక్టర్లు బుధవారం కూడా సమ్మె కొనసాగించారు. కళ్లకు నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయం, పీజీలు ఎదుర్కొంటున్న ఆర్థిక భారాన్ని తెలియజేసే విధంగా కూరగాయలు విక్రయిస్తున్నట్లు స్కిట్ ప్రదర్శించారు.
నేడు జూనియర్ వైద్యుల రక్తదానం..
జూనియర్ డాక్టర్ల ఉపకార వేతన సమస్య పరిష్కారంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. స్టైపండ్‌ను 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా... చర్చల అనంతరం దీన్ని 7 శాతం పెంచుతామని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇందుకు అంగీకరించని జూడాలు 15 శాతం పెంచాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రభుత్వం మరో ఒకటి, రెండు శాతం పెంచేందుకు సుముఖంగా ఉన్నా.. వారు పట్టు వీడకపోవడంతో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కాగా, గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు గురువారం రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేస్తారని ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ శంకర్ తెలిపారు.