Share News

అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిపై పరువు నష్టం దావా

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:46 AM

సదరం సర్టిఫికెట్‌ కోసం రూ.50 వేలు లంచం అడిగారంటూ జీజీహెచ్‌ వైద్యునిపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని విచారణ కమిటీ తేల్చింది.

అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తిపై పరువు నష్టం దావా

  • తప్పుడు ఫిర్యాదుతో వైద్యుని మనోభావాలు దెబ్బతిన్నాయి

  • జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుందరాచారి

గుంటూరు మెడికల్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): సదరం సర్టిఫికెట్‌ కోసం రూ.50 వేలు లంచం అడిగారంటూ జీజీహెచ్‌ వైద్యునిపై వచ్చిన ఆరోపణలు సత్యదూరమని విచారణ కమిటీ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న వైద్యుడు రత్నకిషి తప్పుడు ఫిర్యాదు చేసిన రోగి తండ్రిపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు ప్రకటించారు. ‘సదరం సర్టిఫికెట్‌ కోసం వచ్చి అసత్య ఆరోపణలతో నన్ను రచ్చకీడ్చిన పల్లెల రాఘవేంద్రరావుపై పరువు నష్టం దావా వేస్తున్నా. ఆయన చేసిన తప్పుడు ఫిర్యాదుతో... సోషల్‌ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. చంపుతామని కొందరు బెదిరింపు పోస్టింగ్‌లు పెట్టారు. పెట్రోల్‌ పోసి కాల్చేయాలంటూ నాపై తీవ్ర ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. చివరకు నా భార్యకూ బెదింపులు తప్పడం లేదు. ఆయన చేసిన అసత్య ఆరోపణతో, నేను చేయని తప్పునకు జీవితంలో అతి పెద్ద మచ్చను మోయాల్సి వస్తోంది. జరుగుతున్న పరిణామాలతో నా మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయి. అందకనే పల్లెల రాఘవేంద్రరావుపై పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నా’ అని రత్నకిషి తెలిపారు. ప్రభుత్వ వైద్యులు సంఘం, జీజీహెచ్‌ వైద్యులు కూడా డాక్టర్‌ కిషికి మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ‘సదరం సర్టిఫికెట్‌ జారీ కోసం మా ఆసుపత్రి వైద్యుడు లంచం డిమాండ్‌ చేశారంటూ వచ్చిన ఆరోపణ సత్యదూరం.


ఫిర్యాదుపై కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు సమగ్ర విచారణ జరిపాం. ఆరోపణలు ఎదుర్కొన్న సైకియాట్రి విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కొండవీటి రత్నకిషి నిర్దోషి’ అని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి తెలిపారు. కాగా, 2014-19 సంవత్సరాల మధ్య ఆటిజం టెంపరరీ సర్టిఫికెట్‌ ఉన్న వారికీ ప్రభుత్వం రూ.6 వేలు పెన్షన్‌ అందజేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెంపరరీ సర్టిఫికెట్‌కు పెన్షన్‌ను రద్దు చేసింది. రెండేళ్ల కిందట అఽధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కొనసాగుతోంది. దీనికి సమర్థనగా 18 ఏళ్లు నిండిన ఆటిజం రోగులకు మాత్రమే పర్మినెంట్‌ సదరం సర్టిఫికెట్‌ ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

Updated Date - Jun 20 , 2026 | 04:48 AM