Share News

కాటేసిన కలుషిత ఆహారం

ABN , Publish Date - May 16 , 2026 | 05:55 AM

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని పాతపల్లె గ్రామం డయేరియాతో మంచం పట్టింది. ఈ గ్రామంలో వాంతులు, విరేచనాలతో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

కాటేసిన కలుషిత ఆహారం

  • కూటమి సభల్లో మిగిలిపోయిన మాంసం ఇంటికి

  • తీసుకెళ్లి తిన్నవారిలో 44మందికి తీవ్ర అస్వస్థత

  • ఆరుగురి పరిస్థితి విషమం...తెనాలికి తరలింపు

  • మిగతావారికి స్థానిక చర్చిలోని వైద్యశిబిరంలో చికిత్స

  • చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని పాతపల్లెలో ప్రతి ఇంట్లో ఒకరిద్దరిలో డయేరియా లక్షణాలు

  • పరిస్థితిని సమీక్షించిన మంత్రి సత్యకుమార్‌

గుంటూరు మెడికల్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోని పాతపల్లె గ్రామం డయేరియాతో మంచం పట్టింది. ఈ గ్రామంలో వాంతులు, విరేచనాలతో 44 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తెనాలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. స్థానిక చర్చిలో వైద్యశిబిరం ఏర్పాటుచేసి తక్కిన వారందరికీ వైద్యం అందిస్తున్నారు. వీరు కాకుండా కుటుంబానికి కనీసం ఇద్దరు, ముగ్గురు చొప్పున ఇళ్లలోనే వైద్యం పొందుతున్నారని అంచనా. ఇలా.. మొత్తం 100కి పైగా డయేరియా బారిన పడినట్టు వైద్యాధికారులు భావిస్తున్నారు. కలుషిత ఆహారమే ఈ ఘటనకు కారణమని ప్రాఽథమికంగా నిర్ధారించారు. స్థానిక బేతస్థ ప్రార్థనా మందిరంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రార్థనా కూటములు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహకులు భక్తులకు మొదటి రెండురోజులు శాకాహారం వడ్డించారు. చివరి రోజు రాత్రి మాంసాహారం పెట్టారు. అయితే, అప్పటికే భక్తుల్లో చాలామంది వెనుదిరగడంతో వండిన మాంసంలో అధిక భాగం మిగిలిపోయింది. మరుసటి రోజు అక్కడికి సమీపంలోనివారు ఆ మాంసం ఇళ్లకు తీసుకెళ్లారు. ఫ్రిజ్‌లో పెట్టుకుని రెండురోజులుగా తింటున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నుంచే ఒక్కొక్కరుగా అస్వస్థతకు గురవ్వడం మొదలుపెట్టారు. వాంతులు, విరేచనాలు, తీవ్ర నీరసంతో మంచం పట్టారు. వేసవికాలం కావడంతో నిల్వ ఉన్న మాంసం చెడిపోయి విషాహారంగా మారినట్టు స్థానిక వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెనాలిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరైన రాజేశ్‌ మాట్లాడుతూ, తాను, తన అమ్మమ్మ వజ్రమ్మ, అక్క యమున రాత్రి మాంసహారం తిన్న కొద్ది గంటలకే అస్వస్థతకు గురయ్యామని తెలిపారు. కూటమి ప్రార్థనలకు సుమారు 300 మంది హాజరయినట్లు ఆయన తెలిపారు. కలుషిత ఆహారం ఘటనపై జిల్లా కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ వెంటనే స్పందించి వైద్య, రెవెన్యూ, పంచాయతీ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నవారిని ఆయన పరామర్శించారు. ప్రతి ఇంటికీ ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు సరఫరా చేయాలని, ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అస్వస్థతకు గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని డీఎంహెచ్‌వో విజయలక్ష్మిని ఆదేశించారు. డయేరియా కేసులపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌.. అధికారులతో చర్చించారు.

Updated Date - May 16 , 2026 | 05:56 AM