మంచి మార్కులు సాధించి.. విమానంలో ఢిల్లీకి..!
ABN , Publish Date - May 21 , 2026 | 04:35 AM
వాళ్లు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూసుంటారు...! దేశ రాజధాని ఢిల్లీ గురించి పుస్తకాల్లో చదివి ఉంటారు..! ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేదింటి పిల్లలకు ఇప్పుడు విమాన ప్రయాణం..
పదో తరగతిలో 40 మంది టాపర్లకు బహుమతి
విద్యార్థులు, టీచర్లతో ఢిల్లీకి ఎమ్మెల్యే గళ్లా మాధవి
గుంటూరు, మే 20, (ఆంధ్రజ్యోతి): వాళ్లు విమానాన్ని గాల్లో ఎగురుతుంటే చూసుంటారు...! దేశ రాజధాని ఢిల్లీ గురించి పుస్తకాల్లో చదివి ఉంటారు..! ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేదింటి పిల్లలకు ఇప్పుడు విమాన ప్రయాణం, ఢిల్లీ వీక్షణం.. నిజ జీవిత అనుభవంగా మారనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకిచ్చిన మాటను ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిలబెట్టుకోవడంతో 40మందికి తొలిసారిగా విమానం ఎక్కే అవకాశం దక్కనుంది. ఈ 40 మందిని విమానంలో ఢిల్లీ విహారయాత్రకు పంపిస్తూ బుధవారం అరుదైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్డులోని ఎస్‌కేబీఎం హైస్కూల్ వద్ద బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో... ఢిల్లీ యాత్రకు బయల్దేరిన బస్సును కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎన్డీయే కూటమి నేతలు కలిసి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాధవి కూడా విద్యార్థులతో కలిసి ఢిల్లీ పర్యటనకు బయల్దేరడం విశేషం. విమానం ఎక్కే ముందు విద్యార్థులు సెల్ఫీలు దిగుతూ.. ‘‘మా జీవితంలో మర్చిపోలేని రోజు’’ అని ఆనందం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో విద్యార్థులకు ఉపరాష్ట్రపతిని కలిసే సువర్ణావకాశాన్ని కూడా మాధవి కల్పించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అపాయింట్‌మెంట్ ఇప్పించినట్లు సమాచారం.