Share News

గుంతకల్లు-బళ్లారి మధ్య మరో 2 రైల్వే లైన్లు

ABN , Publish Date - Jul 25 , 2026 | 05:02 AM

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నడుమ రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కీలకమైన ఆర్థిక కారిడార్‌లో మెగా రైల్‌ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా గుంతకల్లు, బళ్లారి మధ్య మరో రెండు లైన్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది.

గుంతకల్లు-బళ్లారి మధ్య మరో 2 రైల్వే లైన్లు

  • ఏపీ-కర్ణాటక కీలక కారిడార్‌లో 3, 4 లైన్ల నిర్మాణం

  • నిడివి 46 కిమీ.. వ్యయం రూ.1264 కోట్లు

  • మెగా కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

  • వేదవతి నదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం

  • రసాయన రంగానికి ఊతం

  • 3,030 కోట్లతో 3 కెమికల్‌ పార్కుల ఏర్పాటు: రైల్వే మంత్రి

న్యూఢిల్లీ, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల నడుమ రైల్వే లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కీలకమైన ఆర్థిక కారిడార్‌లో మెగా రైల్‌ కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా గుంతకల్లు, బళ్లారి మధ్య మరో రెండు లైన్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. అలాగే దేశంలో రసాయన రంగానికి ఊతమిచ్చేలా మూడు కెమికల్‌ పార్కుల ఏర్పాటుకు కూడా నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన క్యాబినెట్‌ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వే-ఎలకా్ట్రనిక్స్‌-ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి-గతి శక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా గుంతకల్లు-బళ్లారి నడుమ 3, 4 రైల్వే లైన్లను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.1164 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల పొడవున వీటి నిర్మాణాన్ని 202829నాటికి పూర్తిచేస్తామని చెప్పారు. ఈ మార్గంలో వేదవతి నదిపై భారీ వంతెన నిర్మిస్తామని.. మరో ఏడు పెద్ద వంతెనలు, 52 చిన్న వంతెనల నిర్మాణం కూడా జరుగుతుందని తెలిపారు.


గుంతకల్లు-బళ్లారి-హోస్పేట-హుబ్బళి-అంకోలాలను కలుపుతూ తలపెట్టిన భారీ రైల్‌ కారిడార్‌.. గుంతకల్లు-బళ్లారి సెక్షన్‌ మొత్తాన్నీ కవర్‌ చేస్తుందన్నారు. ‘కొద్ది నెలల కిందట క్యాబినెట్‌ బళ్లారి-హోస్పేట్‌ మధ్య 3, 4 లైన్ల నిర్మాణాన్ని ఆమోదించింది. ఇప్పుడు గుంతకల్లు-బళ్లారి మధ్య నిర్మించబోతోంది. హోస్పేట్‌-హుబ్బళి మధ్య లైన్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ఇప్పటికే తయారవుతోంది’ అని చెప్పారు. ఇక రూ.3,030 కోట్లతో దేశంలో మూడు కెమికల్‌ పార్కులు ఏర్పాటుకు కొత్త స్కీంను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిపేరు భారత్‌ ఔద్యోగిక్‌ వికాస్‌ యోజన రసాయన్‌ (భవ్య రసాయన్‌ స్కీం). ప్రతిపాదిత వ్యయంలో రూ.3 వేల కోట్లను ఆయా పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు ఖర్చుచేస్తారు. మిగతా 30 కోట్లు పాలనాపరమైన వ్యయం. ఈ స్కీం ఐదేళ్లు అమల్లో ఉంటుంది.

Updated Date - Jul 25 , 2026 | 05:04 AM