Share News

వైభవంగా గుణదల తిరునాళ్ల ప్రారంభం

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:44 AM

గుణదల లూర్థుమాత 102వ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్‌ గ్రాసి హైస్కూల్‌ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మరియమాతను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. మేరీమాత పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్ఞోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేసి మహోత్సవాలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు నుంచి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.

వైభవంగా గుణదల తిరునాళ్ల ప్రారంభం

-లూర్థుమాత 102వ మహోత్సవాలను ప్రారంభించిన మత పెద్దలు

-శ్రీసభలో మరియతల్లికి సమైఖ్యమాతగా గుర్తింపు

-జూబిలేరియన్‌ రెవ.షాదర్‌ వేలటూరి ఫ్రాన్సిస్‌

గుణదల లూర్థుమాత 102వ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బిషప్‌ గ్రాసి హైస్కూల్‌ గ్రౌండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మరియమాతను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. మేరీమాత పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్ఞోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేసి మహోత్సవాలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాలకు నుంచి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.

గుణదల, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):

ప్రసిద్ధి చెందిన గుణదల కొండపై కొలువైన లూర్థుమాత 102వ మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు విజయవాడ కతోలిక పీఠం పీఠాధిపతి తెలగతోటి జోసఫ్‌ రాజారావు, గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు, మోన్సిగ్ఞోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌ జ్యోతిప్రజ్వలన చేసి మహోత్సవాలను ప్రారంభించారు. బిషప్‌ జోసఫ్‌ రాజారావు డయాసిస్‌ గురువులతో కలిసి బిషప్‌ గ్రాసి హైస్కూల్‌ గ్రౌండ్‌ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మరియమాతను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్టించారు. అనంతరం పవిత్ర కళావేదికపై జోసఫ్‌ రాజారావుతో కలిసి సిల్వర్‌ జూబిలేరియన్‌ గురువులు ప్రధాన యాజకులు మద్దాల జోసఫ్‌, వేలటూరి ఫ్రాన్సిస్‌, వికార్‌ జనరల్‌ ఫాదర్‌ యం.గాబ్రియేలు, మోన్సిగ్ఞోర్‌ ఫాదర్‌ మువ్వల ప్రసాద్‌, రెక్టర్‌ యేలేటి విలియం జయరాజు, తదితర డయాసిస్‌ గురువులు ఉత్సవాల ప్రారంభ సమష్టి దివ్యపూజాబలి సమర్పించారు. జూబిలేరియన్‌ గురువులను బిషప్‌ రాజారావు శాలువాకప్పి ఘనంగా సత్కరించారు.

ప్రారంభ సందేశం ఇచ్చిన ఫాదర్‌ వేలటూరు

మరియ తల్లికి శ్రీసభలో సమైఖ్యమాతగా గుర్తింపు లభించిందని జూబిలేరియన్‌ ఫాదర్‌ వేలటూరి ఫ్రాన్సిస్‌(కెనడా) తెలిపారు. నేటి ప్రపంచంలో అనేక దేశాలు విభజన దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పారు. సమాజంలో అస్తిరత , అశాంతి నెలకొని ఉందన్నారు. మరియ తల్లి సంపూర్ణ దైవత్వానికి కేంద్ర బిందువుగా నిలిచిందని తెలిపారు. సమస్త జాతులను ఐక్యపరిచే శక్తి సృష్టికర్త అయిన దేవుడుకే సాధ్యమన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ గుణదల లూర్థుమాతను వేడుకుందామని పిలుపునిచ్చారు. అంతకు ముందు బిషప్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు మాట్లాడుతూ సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్న గురువులు అంటే పవిత్రులని, ఆ పవిత్రతలో మనం భాగస్వాములైతే తిరుసభ విరాజిల్లుతోందన్నారు.

వీధుల్లో మరయమాత తేరు ప్రదక్షిణ

మరియమాతను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గుణదల పురవీఽధుల్లో ఊరేగించారు. మరియమాత తేరు ప్రదక్షణ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం రెక్టర్‌ ఫాదర్‌ యేలేటి విలియం జయరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఊరేగింపు ప్రారంభ కార్యక్రమానికి వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఊరే గింపులో భక్తిగీతాలు ఆలపిస్తూ మేళతాళాలతో ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో గురువులు సునీల్‌ రాజు, మరియప్ప, కిరణ్‌బాబు, చిన్నప్ప, జోసఫ్‌, తోమస్‌, జాన్‌ పీటర్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు కడప పీఠాధిపతి డాక్టర్‌ సగినాల పాల్‌ ప్రకాష్‌, విజయవాడ పీఠాధిపతి డాక్టర్‌ తెలగతోటి జోసఫ్‌ రాజారావు తదితర గురువులు సమష్టిదివ్యపూజాబలి సమర్పించారు. బిషప్‌ గ్రాసీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కళావేదికపై ప్రదర్శించిన పలు నాటికలు, బుర్రకథలు ఆకట్టుకున్నాయి. వివిధ ప్రాంతాలకు నుంచి విశ్వాసులు భారీగా తరలివచ్చారు.

Updated Date - Feb 10 , 2026 | 12:44 AM