Share News

‘గల్ఫ్‌’ టెన్షన్‌ !

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:18 AM

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లోని మన తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ స్వగ్రామాల్లోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌ ప్రతిదాడులతో గల్ఫ్‌ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

‘గల్ఫ్‌’ టెన్షన్‌ !

- గల్ఫ్‌ దేశాల్లో మనోళ్లు.. యుద్ధం ముదిరితే సమస్యే

- స్వగ్రామాల్లోని తల్లిదండ్రులు, బంధువుల్లో ఆందోళన

- విమానాల రద్దుతో నిలిచిపోయిన రాకపోకలు

- దుబాయ్‌లో పేలుళ్లతో దయాకర్‌ కుటుంబంలో ఆగిన అన్నప్రాసన

- ఉప్పులూరు నుంచి వెళ్లాల్సిన కుటుంబ సభ్యుల ప్రయాణం వాయిదా

- జెడ్డాలో కొండపల్లికి చెందిన హసీనా కుటుంబం నివాసం

- దాడులు జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలోనే..

- బహ్రెయిన్‌లో వల్లభనేని ప్రవీణ్‌ కుటుంబం

- సమీపంలోని బే స్‌ క్యాంప్‌పై దాడి

ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లోని మన తెలుగు ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ స్వగ్రామాల్లోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్‌ ప్రతిదాడులతో గల్ఫ్‌ దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ /ఇబ్రహీంపట్నం):

దుబాయ్‌, షార్జా, అబుదాబి, బహ్రెయిన్‌ తదితర దేశాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి వందల సంఖ్యలో తెలుగు కుటుంబాలు నివశిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందా అన్న ఆందోళన నెలకొంది. దుబాయ్‌లో భారీ పేలుళ్లు సంభవించడంతో అక్కడ ఉన్న మన తెలుగు ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. యూఎస్‌, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలపై దాడులకు తెగబడటంతో గల్ఫ్‌ దేశాల్లో ఉన్న మనవాళ్లకు ఏమైనా అవుతుందని ఇక్కడ వారి కుటుంబ సభ్యులు కన్నీరు పెడుతున్నారు.

అన్నప్రాసనకు వెళ్దామనుకుంటే..

కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన ఉడతా వెంకటేశ్వరరావు (కొండ) కుమారుడు దయాకర్‌, కోడలు దీప్తి దంపతుల దుబాయ్‌లోని కరామా ప్రాంతంలో నివశిస్తున్నారు. దయాకర్‌ షార్జాలో హార్డ్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నాడు. ఇటీవల ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. ఈ నెల 11వ తేదీన అన్న ప్రాసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఉప్పులూరు గ్రామం నుంచి తండ్రి కొండ, సోదరి సునీత ఈ నెల 3వ తేదీన దుబాయ్‌ వెళ్లటానికి ప్లాన్‌ చేసుకున్నారు. షార్జా విమాన సర్వీసు రద్దు కారణంగా వారు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. దుబాయ్‌లో పేలుళ్లు సంభవిస్తుండటంతో.. దయాకర్‌, దీప్తి దంపతులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధ మేఘాలతో తమ కొడుకు, కోడలు, మనవడి పరిస్థితి ఏమిటోనని తండ్రి కొండ, సోదరి సునీత ఆందోళన చెందుతున్నారు. దయాకర్‌ తండ్రి, కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాల గురించి తెలుసుకుంటున్నారు. తమ గురించి ఆందోళన చెందవద్దని తండ్రి, సోదరికి దయాకర్‌, దీప్తి దంపతులు ధైర్యం చెబుతున్నారు.

జెడ్డాలో ఆంధ్రా ముస్లిం కుటుంబం

సౌదీ అరేబియాలోని జెడ్డా అనే ప్రాంతంలో ఎన్టీఆర్‌ జిల్లా (కొండపల్లి), ఏలూరు ప్రాంతానికి చెందిన డాక్టర్‌ ఎండీ జహంగీర్‌ పాషా- హసీనా జహంగీర్‌ కుటుంబం ఉంది. ప్రస్తుతం యూఎస్‌ క్యాంప్‌ బేసిన్‌పై ఇరాన్‌ దాడి చేస్తున్న ప్రాంతానికి వీరు కేవలం 500 కిలో మీటర్ల దూరంలో ఉన్నారని వారి బంధువులు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లికి చెందిన హసీనా జహంగీర్‌తో జహంగీర్‌ పాషాకు 30 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరు వివాహం అనంతరం జెడ్డాలో స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు ఆసే్ట్రలియాలో ఉంటున్నారు. ఒక బాబుతో కలిసి వీరు ప్రస్తుతం జెడ్డాలో ఉన్నారని ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీకి చెందిన హసీనా జహంగీర్‌ సోదరుడు ఆలి హైదర్‌ తెలిపారు. ఐఎంవో కాల్‌ ద్వారా మేము సేఫ్‌ అని రెండు మాటలు మాట్లాడిన తర్వాత వారి కాల్‌ కట్‌ అవుతుందని ఆలి హైదర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

జూఫర్‌ ప్రాంతంలో గుడ్లవల్లేరుకు చెందిన కుటుంబం

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు గ్రామానికి చెందిన వల్లభనేని ప్రవీణ్‌ కుటుంబం బహ్రెయిన్‌ రాజధాని మనామాలోని జూఫర్‌ ప్రాంతంలో నివసిస్తోంది. ఇది ఇరాన్‌ దాడి చేసిన యూఎస్‌ నేవీ బేస్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంది. టీడీపీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన వల్లభనేని బాబూరావు సోదరుడైన వల్లభనేని సత్యనారాయణ కుమారుడు వల్లభనేని ప్రవీణ్‌. బహ్రెయిన్‌ దేశంలో ఎస్కలేటర్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబం జూఫర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివశిస్తోంది. గత పది రోజులుగా ఆ దేశ ప్రభుత్వ అధికారులు స్థానికంగా ప్రజలను ఈ తరహా దాడులు ఉండవచ్చని అప్రమత్తం చేస్తోందని ప్రవీణ్‌ శనివారం ‘ఆంధ్రజ్యోతి‘కి చెప్పారు. దాడులు తీవ్రతరం కావటంతో వల్లభనేని సత్యనారాయణ కుటుంబం ఆందోళన చెందుతోంది. ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నా.. ఏదో కొంత ఆందోళన కూడా ఆయన స్వరంలో కనిపిస్తోంది. భారత ప్రభుత్వం అవసరమైన పక్షంలో తమను ఇండియాకు తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:18 AM