అంబటి వంటి వారిని బహిష్కరించాలి
ABN , Publish Date - Feb 02 , 2026 | 05:00 AM
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం తీవ్రంగా ఖండించింది.
చంద్రబాబుపై వ్యాఖ్యలను ఖండించిన గల్ఫ్ టీడీపీ విభాగం
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, సౌదీ అరేబియాలోని పార్టీ నేతలు జానీ బాషా, చెన్నుపాటి రాజశేఖర్ ప్రకటనలు విడుదల చేశారు. ‘విమర్శలు ఎప్పటికీ విధానాలపై ఉండాలి కానీ వ్యక్తిగతంగా ఉండకూడదు. బూతు పురాణాలను నమ్ముకున్న నాయకులకు చట్టబద్ధంగా తగిన శాస్తి జరగాలి’ అని పేర్కొన్నారు. ఒమన్‌లోని పార్టీ నేత గారపాటి సత్యశ్రీధర్ ఓ ప్రకటనలో... అంబటిపై చట్టపరమైన చర్యలను సమర్థించారు. ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత దూషణలకు స్థానం లేదన్నారు. ఖతర్ టీడీపీ నేత మద్దిపోటి నరేశ్ మాట్లాడుతూ, ‘వైసీపీ నాయకులు ఇంకా ఆటవిక రాజ్యాన్ని నమ్ముకొని అదే భ్రమల్లో విహారిస్తున్నారు. రాంబాబుపై కఠిన చర్యలు తీసుకొని, రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పడానికి ఉపక్రమించాలి’ అని విజ్ఞప్తి చేశారు. కువైత్‌లోని పార్టీ నేత కుదురవల్లి సుధాకర్ రావు... ‘బూతులు మాట్లాడడం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉంది. ఆ పార్టీ నీచ సంస్కృతి, విధానాలను ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపించినా జగన్ బృందం గుణపాఠం నెర్చుకోలేదు’ అని మండపడ్డారు. దుబాయిలోని పార్టీ నాయకుడు డాక్టర్ ముక్కు తులసి కుమార్... సభ్యత, సంస్కారం కలిగిన ప్రతి ఒక్కరు అంబటి లాంటి ఆంబోతులను సమాజం నుంచి బహిష్కరించాలి అని పిలుపునిచ్చారు. బహ్రెయిన్‌లోని పార్టీ విభాగమూ తీవ్రంగా ఖండించింది.