గూడూరు-రేణిగుంట మధ్య మూడో లైన్
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:36 AM
తిరుపతి జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన మూడో రైల్వే లైన్..
భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్
తిరుమల శ్రీవారి భక్తులకు ప్రయోజనం
చెన్నై, బెంగళూరు ప్రయాణికులకూ
న్యూఢిల్లీ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. గూడూరు- రేణిగుంట స్టేషన్ల మధ్య 83.17 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన మూడో రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 20 ఈ కింద భూసేకరణను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తరఫున దక్షిణ తీర రైల్వే గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది.
భూసేకరణకు సమస్యల్లేవు.. అభ్యంతరాల్లేవు
రవాణా రద్దీని తగ్గించేందుకు దీనిని ‘ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు‘గా ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సెక్షన్ 20ఏ కింద భూసేకరణ ఉద్దేశాన్ని ప్రకటిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌పై చట్టబద్ధమైన గడువు ముగిసేవరకు ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. ఈమేరకు అధికార యంత్రాంగం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. గెజిట్ ప్రచురణతో రైల్వే చట్టం సెక్షన్ 20ఈ(2) ప్రకారం, షెడ్యూల్‌లో పేర్కొన్న భూములన్నీ ఎలాంటి వివాదాలు, బకాయిలు లేనివిధంగా సర్వహక్కులతో కేంద్రం ఆధీనంలోకి రానున్నాయి. దీంతో భూసేకరణ అడ్డంకులు తొలగి పనులు మరింత వేగవంతం కానున్నాయి. కాగా, గూడూరు-రేణిగుంట మార్గం దక్షిణ భారతదేశంలోనే అత్యంత కీలకమైన, రద్దీతో కూడిన రైలు మార్గం. ఈ మూడో లైన్ అందుబాటులోకి వస్తే శ్రీవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులతోపాటు, చెన్నై, విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణించే వేలాది మందికి అధిక సమయం ఆదా అవుతుంది. రైళ్ల రాకపోకల వేగం పెరగడమే కాకుండా, ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు పెద్దపీట పడనుంది.