Candidate Selection: 7న గ్రూప్-1 క్రీడా కోటా ఇంటర్వ్యూలు
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:48 AM
గ్రూప్-1 ఫలితాల విడుదల అంశం కొలిక్కి వస్తోంది. గ్రూప్-2 నోటిఫికేషన్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టివేయడంతో...
పోస్టులకు నలుగురు అభ్యర్థులు ఎంపిక
గ్రూప్-2లో అన్‌విల్లింగ్ ఆప్షన్: ఏపీపీఎస్సీ
అమరావతి, జనవరి 1(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 ఫలితాల విడుదల అంశం కొలిక్కి వస్తోంది. గ్రూప్-2 నోటిఫికేషన్ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఇటీవల హైకోర్టు కొట్టివేయడంతో గ్రూప్-1 ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. రిజర్వేషన్లపై అస్పష్టతతో ఇప్పటి వరకూ నిలిపివేసిన క్రీడా కోటా ఇంటర్వ్యూలను ఈనెల 7న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. క్రీడా కోటా పోస్టులకు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసింది. వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు. అలాగే గ్రూప్-2 ఉద్యోగం వద్దనుకొనేవారి కోసం అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పటికే ఇతర ఉద్యోగాలకు ఎంపికై, గ్రూప్-2 ఉద్యోగం వద్దనుకునే అభ్యర్థులు అన్‌విల్లింగ్ ఫారం సమర్పించాలని సూచించింది. దానివల్ల తర్వాతి మెరిట్ అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసే అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న అన్‌విల్లింగ్ ఫారంను డౌన్‌లోడ్ చేసుకొని, వివరాలు నింపి తిరిగి ఏపీపీఎస్సీకి మెయిల్ చేయాలని సూచించింది. అయితే ఇది పూర్తిగా అప్షనల్ అని, తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. అలాగే సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఇచ్చిన పోస్టు ప్రాధాన్యతల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించింది.