Share News

APPSC Candidates: ‘ఫలితం’ తేలేదెన్నడు!

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:49 AM

గ్రూప్‌-1, 2 ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్లు జారీచేసి రెండేళ్లు దాటినా ఇప్పటికీ తుది ఫలితాలు విడుదలకాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది.

APPSC Candidates: ‘ఫలితం’ తేలేదెన్నడు!

  • గ్రూప్‌-1, 2 నోటిఫికేషన్లు ఇచ్చి రెండేళ్లు

  • నేడు ఏపీపీఎస్సీ కార్యాలయానికి అభ్యర్థులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గ్రూప్‌-1, 2 ఫలితాల వెల్లడిలో అంతులేని జాప్యం జరుగుతోంది. నోటిఫికేషన్లు జారీచేసి రెండేళ్లు దాటినా ఇప్పటికీ తుది ఫలితాలు విడుదలకాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. అనేక న్యాయ వివాదాల అనంతరం ఇటీవల గ్రూప్‌-2కు అడ్డంకులు తొలగిపొయాయి. కానీ, గ్రూప్‌-1 నోటిఫికేషన్‌పై కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ఫలితాల వెల్లడిని తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో గ్రూప్‌-1కు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేవరకు గ్రూప్‌-2 ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో 1:2 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

2023 డిసెంబరులో నోటిఫికేషన్లు

గ్రూప్‌-1, 2 రెండు నోటిఫికేషన్లు 2023, డిసెంబరులోనే విడుదలయ్యాయి. 905 పోస్టులతో విడుదలైన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలు 2024 ఫిబ్రవరిలో జరిగాయి. ఆ తర్వాత ఏడాది కాలానికి 2025, ఫిబ్రవరిలో మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం 2 వేల మందికి పైగా అభ్యర్థులను 2025, ఏప్రిల్‌లో ఎంపిక చేశారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తవగా ఆ తర్వాత తుది ఫలితాల ప్రక్రియ న్యాయ వివాదాలతో ఆగిపోయింది. హారిజంటల్‌ రిజర్వేషన్‌ అంశంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ఇటీవల వరకు విచారణ జరిగింది. ఆ పిటిషన్లను ఇటీవల న్యాయస్థానం తోసిపుచ్చింది. కాగా, మరో ముగ్గురు అభ్యర్థులు వేర్వేరు పిటిషన్లు వేశారు. వారి పిటిషన్లకు సంబంధించిన పోస్టులు మినహా మిగిలిన ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించిన ఏపీపీఎస్సీ తర్వాత ఏంచేస్తుందనేది మాత్రం ప్రకటించలేదు.


గ్రూప్‌-1లో ముగిసిన ఇంటర్వ్యూలు

గ్రూప్‌-1 వ్యవహారంలోనూ రోస్టర్‌ కేసు ఉండటంతో క్రీడా కోటాలో భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలను ఏపీపీఎస్సీ నిలిపివేసింది. కాగా గ్రూప్‌-2పై రోస్టర్‌లో స్పష్టత రావడంతో దాని ఆధారంగా క్రీడా కోటా అభ్యర్థులకు ఈ నెల 7న ఇంటర్వ్యూలు నిర్వహించింది. కాగా, దీనిపై రోస్టర్‌ కేసు పెండింగ్‌లో ఉండటంతో దానిపై తీర్పు వచ్చే వరకు ఫలితాలు ఇవ్వలేరు. అయితే గ్రూప్‌-1 ఫలితాలు ఇచ్చే వరకు గ్రూప్‌-2 ఫలితాలనూ ఇవ్వరు. దీనికికారణం.. రెండు నోటిఫికేషన్లలోనూ పరీక్షలు రాసిన అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు గ్రూప్‌-2 ఫలితాలు ఇస్తే అందులో ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులకు, మళ్లీ గ్రూప్‌-1లోనూ వస్తే వాటికి వెళ్లిపోతారు. అప్పుడు వారు పొందిన గ్రూప్‌-2 పోస్టులు ఖాళీ అవుతాయి. అందుకే ముందు గ్రూప్‌-1 ఫలితాలు విడుదల చేసి ఆ తర్వాతే గ్రూప్‌-2 ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

ఇలాగైతే మా పరిస్థితేంటి?

ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంపై అభ్యర్థులు, నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఒక్కో నోటిఫికేషన్‌కు రెండేళ్లకు పైగా సమయం పడితే నిరుద్యోగులు ఎన్ని పరీక్షలు రాయగలరనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. త్వరగా ఫలితాలు ఇవ్వాలనే డిమాండ్‌తో సోమవారం అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యాలయానికి రానున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 05:59 AM