గ్రూప్-2 ఫలితాలు నేడే
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:25 AM
గ్రూప్-2 అభ్యర్థుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. తుది ఫలితాల కోసం కొంత కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఏపీపీఎస్సీ తీపికబురు చెప్పనుంది.
ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం
903 మంది అభ్యర్థులతో జాబితా విడుదలకు కసరత్తు
కేసుల నేపథ్యంలో రెండు పోస్టులు మాత్రం పెండింగ్
జాప్యంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలతో స్పందన
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 అభ్యర్థుల ఎదురు చూపులు ఫలించనున్నాయి. తుది ఫలితాల కోసం కొంత కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఏపీపీఎస్సీ తీపికబురు చెప్పనుంది. గ్రూప్-2 తుది ఫలితాలను బుధవారం విడుదల చేయనుంది. ఈ మేరకు కమిషన్ చర్యలు ప్రారంభించింది. క్రీడా కోటాలో ఇద్దరు అభ్యర్థుల(న్యాయశాఖ ఏఎ్‌సవో, ఎక్సైజ్ ఎస్‌ఐ)కు సంబంధించిన పోస్టులను మినహాయించి మిగిలిన 903 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే, ఎవరికి ఏ పోస్టు వస్తుందనే అంశంపై జాబితాల రూపకల్పన ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు తెలిసింది. దీంతో తుది ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ‘గ్రూప్-2’ ఫలితాల జాప్యంపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. మంగళవారం ప్రచురించిన కథనంపై ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది. ప్రక్రియ పూర్తయినా ఫలితాలు విడుదల చేయకపోవడం పట్ల అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతానికి గ్రూప్-2 తుది ఫలితాల విడుదలకు అడ్డంకులు లేనందున అభ్యర్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని సర్కారు నిర్ణయించింది. ఈ పరిణామాల అనంతరం.. తుది ఫలితాలు విడుదల చేసేలా ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, 905 పోస్టులకు గాను సర్టిఫికెట్ల పరిశీలనకు 2,559 మంది హాజరవగా.. వారిలో 903 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 2 పోస్టులపై కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు.