Share News

Groundwater Levels: పాతాళగంగ పైపైకి!

ABN , Publish Date - Jan 14 , 2026 | 04:06 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతనెలలో భూగర్భ జల మట్టాలు రాయలసీమలో సగటున 6.31 మీటర్లు (20.70 అడుగులు), కోస్తాలో 5.98 మీటర్లు...

Groundwater Levels: పాతాళగంగ పైపైకి!

  • నైరుతి, ఈశాన్య రుతుపవనాల్లో ఎక్కువ వర్షపాతం

  • తెలుగు రాష్ట్రాల్లో ఆశాజనకంగా భూగర్భ జలాలు

  • సీమలో 6.31 మీ., తెలంగాణలో 5.3 మీ. లోతులో

విశాఖపట్నం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నాయి. గతనెలలో భూగర్భ జల మట్టాలు రాయలసీమలో సగటున 6.31 మీటర్లు (20.70 అడుగులు), కోస్తాలో 5.98 మీటర్లు (19.61 అడుగులు), తెలంగాణలో 5.3 మీటర్లు(17.38 అడుగులు) లోతులో ఉన్నాయి. గత జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాలు, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజన్లలో కురిసిన మిగులు వర్షాలతో భూగర్భజలాలు పైకి వచ్చాయి. భూ ఉపరితలంలో నదులు, చెరువులు, వాగుల్లో నీటి లభ్యత ఉందని, దీంతో భూగర్భజలాలు ఆశాజనంగా ఉన్నాయని రిటైర్డు వాతావరణ అధికారి పీవీ రామారావు అన్నారు. సాధారణంగా 3 నుంచి 8మీటర్ల వరకు భూగర్భ జలాలు ఉంటే పంపుసెట్ల ద్వారా నీటిని తోడటంలో ఎటువంటి ఒత్తిడి ఉండదని, అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే పైకి ఉన్నాయని తెలిపారు. గతేడాది జనవరి 1 నుంచి డిసెంబరు31వ తేదీ వరకు కురిసిన వర్షాలు, భూగర్భజలాలు పెరిగిన తీరుపై ఆయన విశ్లేషించారు. తెలంగాణలో సాధారణ వర్షపాతం 85.9 సెంటీమీటర్లకు గాను 113.8 సెంటీమీటర్లు (సాధారణం కంటే 32శాతం ఎక్కువ), రాయలసీమలో 64.5 సెం.మీ.కు 78 సెం.మీ.(21శాతం ఎక్కువ), కోస్తాంధ్రలో 92.4 సెం.మీ.కు గాను 98.2 సెం.మీ. (6ు ఎక్కువ) వర్షపాతం నమోదైంది. దీనివల్ల భూగర్భ జల మట్టాలు పెరగడంతో రబీలో వ్యవసాయ అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలకు తగినంత నీరు అందుబాటులో ఉండనుంది.


ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో కోస్తాంధ్రలో 32.3 సెం.మీ. కుగాను 39.5 సెం.మీ., రాయలసీమలో 23.6 సెం.మీ.కు గాను 31.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తెలంగాణలో 12.4 సెం.మీ.కు గాను 17.9 సెం.మీ. నమోదైంది. అయితే ఈ సీజన్‌లో తుఫాన్ల ప్రభావంతో వర్షాలు ఎక్కువగా కురిశాయి. మొంథా తుఫాన్‌తో కోస్తా, రాయలసీమలో పుష్కలంగా వర్షాలు కురిశాయి. అక్టోబరు 28న రికార్డుస్థాయిలో 16 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లాల్లో సగటున 15, నెల్లూరులో 13, కోస్తాంధ్ర మొత్తం 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒంగోలులో అక్టోబరు 29న 25 సెం.మీ.ల వర్షం పడింది. తెలంగాణలోని వరంగల్‌ రూరల్‌లో 20, హనుమకొండలో 19, కరీంనగర్‌లో 18 సెంటీమీటర్లు వర్షం కురిసింది. దిత్వా తుఫాన్‌ కారణంగా తిరుపతిలో 12.2 సెం.మీ., నెల్లూరులో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. డిసెంబరు 10 తరువాత ఏపీలో వర్షాలు కురవలేదు.


ఉభయ గోదావరి జిల్లాల్లో ఆందోళనకరం

జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలో 95.9 సెంటీమీటర్లు (సాధారణం కంటే 30శాతం ఎక్కువ), కోస్తాంధ్రలో 58.7 సెం.మీ.(2శాతం ఎక్కువ), రాయలసీమలో 46.6 సెం.మీ.లు (14 3శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. రెండు రుతుపవనాల సీజన్లు, అక్టోబరు, నవంబరు నెలల్లో తుఫాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజల మట్టాలు కోస్తాంధ్రలో 1.2 మీటర్లు (3.94 అడుగులు), రాయలసీమలో 2.47 మీటర్లు (8.1 అడుగులు) మేర పైకి వచ్చాయి. డిసెంబరు 1 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో 18.62 మీటర్లు (61.07 అడుగులు), ఏలూరు జిల్లాలో 16.23 మీటర్లు(53.23 అడుగులు), పశ్చిమగోదావరి జిల్లాలో 7.44 మీటర్లు (24.4 అడుగులు) లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో భూగర్భజలాలు లోతుగా ఉండడం ఆందోళనకరంగా మారింది. అయితే మిగిలిన జిల్లాల్లో సంతృప్తికరంగా ఉండటంతో కోస్తాంధ్రలో సగటున 3 నుంచి 6 మీటర్ల లోతులో ఉన్నాయి. అక్టోబరులో కురిసిన వర్షాలతో ఒంగోలులో భూగర్భజలాలు ఏకంగా 18 అడుగులు పైకి వచ్చాయి. రాయలసీమ పరిధిలోని తిరుపతిలో 3.12 మీటర్లు (10.56 అడుగులు), నంద్యాలలో 3.91 మీటర్లలో (12.82 అడుగులు) ఉండగా, ఎక్కువ లోతులో సత్యసాయి జిల్లాలో 10.68 మీటర్లు (35.03 అడుగులు), అనంతలో 9.36 మీటర్ల (36.70 అడుగులు) వరకూ ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో 4.5-6.7 మీటర్ల (15-22 అడుగులు) లోతులో ఉన్నాయి. తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో 2.89 మీటర్లు (9.48 అడుగులు), భూపాలపల్లెలో 8.42 మీటర్లు (27.62 అడుగులు) ఉన్నాయి.


తెలంగాణలో 33 జిల్లాలకు గాను 17 జిల్లాల్లో సగటున 5మీటర్లు (16.40 అడుగులు), మిగిలిన 16 జిల్లాల్లో 5 నుంచి 10 మీటర్లు (15.9 నుంచి 33 అడుగులు) లోతులో భూగర్భజలాలు ఉన్నాయని రామారావు తెలిపారు. గతేడాది వేసవిలో ఎక్కువగా వర్షాలు కురిశాయని, ఆతరువాత రెండు రుతుపవనాల సీజన్లలో మిగులు వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పైకి వచ్చాయని.. దానివల్ల ఈ ఏడాది వేసవిలో భూగర్భ జలాలకు కొరత ఉండదని ఆయన పేర్కొన్నారు. రాయలసీమలోసైతం గత రెండేళ్లలో మంచి వర్షాలు కురవడంతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయని విశ్లేషించారు.

Updated Date - Jan 14 , 2026 | 04:07 AM