Share News

గ్రీన్‌ సిగ్నల్‌!

ABN , Publish Date - Jan 02 , 2026 | 12:56 AM

ఎట్టకేలకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జెడ్పీ అధికారుల్లో కదలిక వచ్చింది. కృష్ణాజిల్లాలో రూ.2.61 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.3.67 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కృష్ణాలో పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో టెండర్లపై అధికారులు ఇంకా నిర్లక్ష్యం వీడలేదు.

గ్రీన్‌ సిగ్నల్‌!

-15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జెడ్పీ అధికారుల్లో కదలిక

-కృష్ణాలో రూ.2.61 కోట్లు, ఎన్టీఆర్‌లో రూ.3.67 కోట్ల పనులకు ఆమోదం

- కృష్ణాలో టెండర్లు పిలిచిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు

- ఎన్టీఆర్‌ జిల్లాలో టెండర్లు పిలవటంలో ఇంకా తాత్సారం!

- మార్చి 10 నాటికే పనులు పూర్తి చేసి బిల్లులు అప్‌లోడ్‌ చేస్తేనే నిధులు!

ఎట్టకేలకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై జెడ్పీ అధికారుల్లో కదలిక వచ్చింది. కృష్ణాజిల్లాలో రూ.2.61 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.3.67 కోట్ల పనులకు ఆమోదం తెలిపారు. దీనిపై స్పందించిన ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు కృష్ణాలో పనులకు టెండర్లు ఆహ్వానించారు. ఎన్టీఆర్‌ జిల్లాలో టెండర్లపై అధికారులు ఇంకా నిర్లక్ష్యం వీడలేదు.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగంలో 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ఎట్టకేలకు ఉమ్మడి కృష్ణాజిల్లా జెడ్పీ అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కృష్ణాజిల్లాలో రూ.2.61 కోట్లు, ఎన్టీఆర్‌ జిల్లాలో రూ.3.67 కోట్ల వ్యయంతో అంచనా వేసిన పనులు ఇక ఆరంభంకానున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7 కోట్ల మేర ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించినవి మురగబెట్టేసే పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ‘లబ్‌ డబ్బు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో జెడ్పీ అధికారులు ఎట్టకేలకు దిగి వచ్చారు. ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వటంతో కృష్ణాజిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు టెండర్లు పిలిచారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంకా టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించలేదు. దీంతో ఆందోళనకరంగా మారింది.

కృష్ణాలో 10 పనులకు టెండర్లు :

గ్రామీణ నీటి సరఫరా మరమ్మతు పనులకు సంబంధించి కృష్ణాజిల్లాలో రూ.2.61 కోట్లకు పలు పనులను అంచనా వేశారు. వీటిలో 10 పనులకు రూ.1.68 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. మిగిలిన పనులను నామినేషన్‌ విధానంలో కట్టబెట్టారు. యనమలకుదురులోని సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లో భాగంగా రూ.7 లక్షల వ్యయంతో 60 హెచ్‌పీ మోటారు ఏర్పాటుకు టెండర్లు పిలిచారు. నాగాయలంక మండలం కొమ్మనమోలు గ్రామంలో పంపింగ్‌ సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఫిల్టర్‌ మీడియా ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించారు. కోడూరు మండలం రామకృష్ణాపురంలో ఊతగుండంలో ఓవర్‌హెడ్‌ రిజర్వాయర్‌ పైపులైన్లను పూర్తిగా మార్చేందుకు రూ.18 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామంలో రూ.12 లక్షల వ్యయంతో పంపింగ్‌ హౌస్‌ దగ్గర రీ కప్‌మెంట్‌ పనులు, గుల్లలమోద గ్రామంలో పాత పైపులైన్లను రూ.10 లక్షల వ్యయంతో మార్చటం, మచిలీపట్నం మండలం ఆకుమర్రు సీపీడబ్ల్యూ స్కీమ్‌లో ధ్వంసమైన పైపులైన్లను పూర్తిగా మార్చేందుకు రూ. 15 లక్షలు, మంగినపూడి సీపీడబ్ల్యూ స్కీమ్‌ పరిధి సుల్తానగరం సెగ్మెంట్‌ పరిధిలో రూ.20 లక్షల వ్యయంతో పాత పైపులైన్‌ రీప్లేస్‌ చేసేందుకు, గూడూరు మండలం ముక్కొల్లు లో క్లోరిన్‌ గ్యాస్‌ సిలిండర్‌ ఏర్పాటుకు రూ. 9 లక్షల వ్యయంతో, నాగవరం గ్రామంలో పైపులైన్‌ రీప్లేస్‌మెంట్‌కు రూ. 12 లక్షల వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. ఇవి కాకుండా నామినేషన్‌ పద్ధతిలో ఇలాంటి తరహా మరో 34 పనులను కేటాయించారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇంకా నిర్లక్ష్యమే!

15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులకు జెడ్పీ అధికారులు రూ.3.67 కోట్ల వ్యయంతో శాంక్షన్‌ ఇచ్చారు. వీటికి తక్షణం టెండర్లు పిలిస్తేనే మార్చి 10 నాటికి పనులు పూర్తి చేయటం సాధ్యమవుతుంది. లేదంటే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 26 పనులకు ప్రతిపాదించారు. చందర్లపాడు మండలంలో రూ.1.08 కోట్ల వ్యయంతో చందర్లపాడు, ముప్పాళ్లలో గ్రావిటీ మెయిన్‌ పనులు, ఫిల్టర్‌ మీడియా వంటి పనులకు టెండర్లు పిలవాల్సి ఉంది. నందిగామ మండలంలో రూ.63 లక్షల వ్యయంతో నీటి సంపుల నిర్మాణం, కంచికచర్లలో రూ.6 లక్షల వ్యయంతో ఎయిర్‌వాల్వ్‌ల ఏర్పాటు, వీరులపాడు మండలం బత్తినపాడులో రూ. 10 లక్షల వ్యయంతో ఆగ్‌మెంటేషన్‌ ఎయిర్‌ వాల్వ్స్‌ పనులు, జి.కొండూరు మండలంలో రూ.1.10 కోట్ల వ్యయంతో దెబ్బతిన్న పైపులైన్లను మార్చడం, జగ్గయ్యపేటలో స్పెషల్‌ రిపేర్లకు రూ.36.5 లక్షలు, వత్సవాయిలో రూ.17.2 లక్షల వ్యయంతో పంపింగ్‌ స్కీమ్‌లలో స్పెషల్‌ రిపేర్లకు, పెనుగంచిప్రోలులో రూ.9 లక్షల వ్యయంతో కొల్లికుల్ల సీపీడబ్ల్యూ స్కీమ్‌లో స్పెషల్‌ రిపేర్లకు టెండర్లు పిలవాల్సి ఉంది. వచ్చే వేసవి కాలం నాటికి ఈ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది. కృష్ణాజిల్లా తరహాలోనే ఎన్టీఆర్‌ జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు త్వరపడి టెండర్లు పిలవకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పవు.

Updated Date - Jan 02 , 2026 | 12:56 AM