Share News

జీవీఎంసీ ఎస్‌ఈ గుండెపోటుతో మృతి

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:23 AM

గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మెకానికల్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.గోవిందరావు (61) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.

జీవీఎంసీ ఎస్‌ఈ గుండెపోటుతో మృతి

  • చెత్త తరలింపుపై సమీక్షలో మాట్లాడుతూ కుప్పకూలిన ఎస్‌ఈ

విశాఖపట్నం/గాజువాక, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) మెకానికల్‌ విభాగం సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ కె.గోవిందరావు (61) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభి గాజువాక జోనల్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ ఎస్‌ఈ గోవిందరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గాజువాక జోన్‌ పరిధి 76వ వార్డులోని గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ (జీటీఎ్‌స)లో చెత్త కుప్పలు పేరుకుపోయాయి. చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన ‘రాసా’ సంస్థ కొద్దిరోజులుగా ఆ పని నిలిపివేసింది. దీంతో ఈ చెత్తను తరలించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 20న స్థానికులు జీటీఎస్‌ యార్డుకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ విషయం పట్టాభి దృష్టికి వెళ్లడంతో ఆయన గురువారం నగరానికి వచ్చారు. గాజువాక జోనల్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య, జోనల్‌ కమిషనర్‌ శేషాద్రితో సమీక్ష నిర్వహించారు. చెత్త పేరుకుపోవడంపై ఎస్‌ఈ గోవిందరావును చైర్మన్‌ ప్రశ్నించగా సమాధానమిస్తూనే.. కుర్చీలో కూలబడిపోయారు. షుగర్‌ లెవెల్స్‌ పెరిగి, అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యులతో సీపీఆర్‌ చేయించి, ప్రైవేటు ఆస్పత్రికి ఆపై.. అంబులెన్స్‌లో కార్పొరేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మరోసారి గుండెపోటురావడంతో తుదిశ్వాస విడిచారు.

Updated Date - Jan 23 , 2026 | 05:16 AM