Share News

CM Chandrababu Appeal: ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి

ABN , Publish Date - Jan 08 , 2026 | 03:56 AM

రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు.

CM Chandrababu Appeal: ‘అమరావతి’కి చట్టబద్ధత కల్పించండి

  • బడ్జెట్‌ సమావేశాల్లోనే బిల్లు ఆమోదించండి

  • నిధులు, ప్రాజెక్టులతో ఏపీని ఆదుకోండి

  • ‘జీ రామ్‌ జీ’తో రాష్ట్రంపై అదనపు భారం

  • ప్రత్యామ్నాయ నిధులు ఇవ్వండి

  • అమిత్‌ షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

  • కేంద్ర క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణ,

  • మద్యం కేసులో జగన్‌ పాత్రపై చర్చ?

న్యూఢిల్లీ, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించేందుకు ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం చంద్రబాబు కోరారు. 2024 నుంచే ఏపీకి రాజధానిగా అమరావతి నిర్ణయించాలని కోరారు. దీనివల్ల రాజఽధానిలో పెట్టుబడులు పెట్టే వారికి భరోసా కలుగుతుందని చెప్పారు. రానున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వాలని, పలు అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రప్రాయోజిత పథకాల్లో రాష్ట్రానికి వాటా పెంచాలని... గృహ నిర్మాణం, రహదారులు, రైల్వే ప్రాజెక్టుల్లో ప్రాధాన్యమివ్వాలని అభ్యర్థించారు. రెవెన్యూలోటును భర్తీ చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. అమిత్‌షా నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులతోపాటు రాజకీయ అంశాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ‘‘వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి. రాయలసీమను హార్టికల్చర్‌ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు బడ్జెట్‌లో నిధులు ఇవ్వాలి. డిసెంబరు 25న పూర్వోదయ, సాస్కీ పథకాల కింద రూ.10,054కోట్ల మేరకు నిఽధులు ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రతిపాదనలు సమర్పించాం. వీటిపై సానుకూలంగా స్పందించండి. పోలవరం-నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు మద్దతు ఇవ్వండి’’ అని చంద్రబాబు కోరారు.


‘ఉపాధి’ మార్పులతో ప్రభావం

ఇటీవల కేంద్రం ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన ‘జీ రామ్‌ జీ’లోని కొన్ని అంశాల నుంచి రాష్ర్టానికి వెసులుబాటు కల్పించాలని అమిత్‌షాను సీఎం కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చడంవల్ల... ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీపై మరింత ప్రభావం పడుతుందని వివరించారు. త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి చంద్రబాబుతో అమిత్‌ షా సూచనప్రాయంగా చర్చించినట్లు తెలిసింది. మద్యంకేసు పురోగతి, జగన్‌ పాత్ర గురించి కూడా వివరాలు సమర్పించినట్లు తెలుస్తోంది. గత పర్యటనలో చంద్రబాబు... అమిత్‌షాను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో... చంద్రబాబును షా ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకున్నారు.

Updated Date - Jan 08 , 2026 | 06:06 AM