Share News

NTRs 30th death Anniversary,: యుగ పురుషుడికి ఘన నివాళి

ABN , Publish Date - Jan 19 , 2026 | 04:26 AM

దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆదివారం సందడి నెలకొంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు...

NTRs 30th death Anniversary,: యుగ పురుషుడికి ఘన నివాళి

  • ఎన్టీఆర్‌కు సాటి ఎవరూ లేరు : బాలకృష్ణ

  • ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాలని నిరూపించారు : పురంధేశ్వరి

  • ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద పలువురి నివాళులు

హైదరాబాద్‌, ఖైరతాబాద్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆదివారం సందడి నెలకొంది. ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, పాతతరం తెలుగుదేశం నేతలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ మనవడు, ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌, ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు, ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, బీజేపీ జాతీయ నాయకురాలు, ఎంపీ పురంధేశ్వరి, ఎన్టీఆర్‌ కుమారుడు రామకృష్ణ, మనవడు, సినీనటుడు కళ్యాణ్‌రామ్‌, లక్ష్మీపార్వతి, ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్‌, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కంభంపాటి రామ్మోహన్‌, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు బక్కని నర్సింహులు, మోత్కుపల్లి నర్సింహులు, తీగల కృష్ణారెడ్డిలతో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు, సినీరంగ ప్రముఖులు, ఎన్టీఆర్‌ అభిమానులు ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఘాట్‌ వద్ద ఎన్టీఆర్‌ జీవిత, సినీ, రాజకీయ విశేషాలతో కూడిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎంతో శ్రమ, దీక్షలతో ఎన్టీఆర్‌ మహానుభావుడయ్యాడని పేర్కొన్నారు. ఆయనకు సాటి ఎవరూ లేరన్నారు. కేవలం కొందరికే రాజకీయం పరిమితమయిన రోజుల్లో అందరికీ రాజకీయ అవకాశాలను కల్పించి బడుగు, బలహీన వర్గాలవారు రాజకీయంగా ఎదిగేలా చేశారన్నారు. ప్రజా సంక్షేమం కోసమే నాయకులు పనిచేయాలని నిరూపించిన నాయకుడు ఎన్టీఆర్‌ అని బీజేపీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాటాడారు. ప్రముఖ సినీ నటుడు, మాజీమంత్రి బాబూ మోహన్‌ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఒక యుగ పురుషుడని, మళ్లీ వస్తాడనే నమ్మకం తనకున్నదని అన్నారు.

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన భువనేశ్వరి

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో రక్తదాన, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌మెమోరియల్‌ ట్రస్టు స్థాపించి ప్రజలకు సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కడియాల రాజేందర్‌, మన్‌మీత్‌ సింగ్‌ తదితర దాతల సహకారంతో ట్రస్టు సేవలను అందిస్తున్నామని ఆమె వివరించారు. జగిత్యాల జిల్లాకు చెందిన టీడీపీ నేత సురేందర్‌ రక్తదానం చేసి ట్రస్టుకు రూ.25 వేల విరాళం ఇవ్వడాన్ని ఆమె అభినందించారు. ట్రస్టు తరఫున బ్లడ్‌ బ్యాంకు కేంద్రాలను హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, రాజమహేంద్రవరంలలో ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు ఐదు లక్షల యూనిట్ల రక్తం సేకరించి 9.18 లక్షల మందికి రక్తాన్ని అందించగలిగామని ఆమె వివరించారు.

Updated Date - Jan 19 , 2026 | 04:26 AM