ఒమాన్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం
ABN , Publish Date - Apr 05 , 2026 | 04:59 AM
భద్రాచలం సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానాల తరహాలో ఒమాన్‌లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
భద్రాచలం సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానాల తరహాలో ఒమాన్‌లో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యుద్ధ ఉద్రిక్తతల పరిస్థితుల్లోనూ శుక్రవారం వెయ్యి కిలో మీటర్ల దూరంలోని సలాల, సోహార్, ఇబ్రి ఎడారి ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో భక్తులు ఒమాన్ రాజధాని మస్కట్‌కు తరలి వచ్చి ఇక్కడి శ్రీకృష్ణ మందిర ఆవరణలో జరిగిన కల్యాణోత్సవ ఘట్టాన్ని తన్మయత్వంతో తిలకించారు. స్థానిక ప్రవాసీ, ప్రముఖ వేద పండితులు విజయకుమార్ ఆధ్వర్యంలో పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య కనులపండుగా కార్యక్రమం కొనసాగింది. కల్యాణోత్సవ ప్రాంగణమంతా జైశ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోయింది. భారత రాయబారి జి.వి.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. యుద్ధ పరిస్థితుల్లో అనేక ఆంక్షలున్నప్పటికీ ఒమానీ ప్రభుత్వం.. సీతారాముల కల్యాణం నిర్వహణకు అనుమతించినందుకు నిర్వాహకులలో ఒకరైన చందక రాందాస్ కృతజ్ఞతలు తెలిపారు.