ఏడు వాహనాలపై ఏడు కొండలవాడి వైభవం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:22 AM
తిరుమలలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తయిన మలయప్పస్వామి ఏడు ప్రధాన వాహనాలపై...
తిరుమలలో ఘనంగా రథసప్తమి వాహన సేవలు
వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్త జనం
తిరుమల, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తయిన మలయప్పస్వామి ఏడు ప్రధాన వాహనాలపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించి భక్త కోటిని కటాక్షించారు. శని, ఆదివారంతో పాటు సోమవారం గణతంత్ర దినోత్సవ సెలవు కావడంతో భక్తులు భారీసంఖ్యలో కొండకు చేరుకున్నారు. ఆదివారం వేకువజాము 5.30 గంటలకు వాహన మండపం నుంచి సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి బయల్దేరి ఆలయ వాయవ్య మూలలోకి వేంచేశారు. 7.10 గంటల తర్వాత హారతి సమర్పించి వాహన సేవను కొనసాగించారు. అనంతరం చిన్న శేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్ర ప్రభ వాహనాలపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించారు. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. రాత్రి చంద్రప్రభ వాహనం వరకు రద్దీ కొనసాగింది.
రాంభగీచా వద్ద దూసుకొచ్చిన భక్తులు
ఆదివారం వేకువజాము సమయానికే మాడవీధులు భక్తులతో నిండిపోవడంతో ఎక్కడికక్కడ గేట్లు మూసివేశారు. రాంభగీచా గేటు వద్ద భక్తులు లోపలకు వెళ్లేందుకు దూసుకొచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భంలో కొంతమంది భక్తులు కిందపడిపోయారు.