అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:24 AM
శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు.. ఫలితమివ్వని ముందస్తు ఏర్పాట్లు
పోలీసుల తీరుపై భక్తుల అసహనం
శ్రీకాకుళం, జనవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు.. ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అరగంటలోనే స్వామివారి దర్శనం పూర్తిచేస్తామని.. సామాన్య భక్తులకే అత్యంత ప్రాధాన్యమిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధుల ముందస్తు ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. భక్తులను క్యూలైన్లలోకి పంపేందుకు పోలీసులు ఎక్కడికక్కడ రోడ్లపై నియంత్రించడంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఏ దర్శనానికి ఏ లైన్లలోకి వెళ్లాలనే సమాచారంలో అస్పష్టత ఏర్పడింది. క్యూలైన్లను నేరుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. సుమారుగా 2 లక్షల మందికిపైగా దర్శించుకున్నట్టు అధికారుల అంచనా. స్వామివారిని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ తదితరులు దర్శించుకున్నారు.