Share News

వైభవంగా సింహాచలేశుని చందనోత్సవం

ABN , Publish Date - Apr 21 , 2026 | 05:27 AM

సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ప్రతిఏటా వైశాఖ శుక్ల తదియనాడు భక్తులకు స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు.

వైభవంగా సింహాచలేశుని చందనోత్సవం

  • తొలిగంధం సమర్పించిన ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు

  • ప్రభుత్వం తరపున హోం మంత్రి పట్టువస్ర్తాల సమర్పణ

సింహాచలం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ప్రతిఏటా వైశాఖ శుక్ల తదియనాడు భక్తులకు స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. లక్ష్మీనరసింహుని ఒంటిపై ఏడాది మొత్తం ఉండే గంధాన్ని ఆరోజు పూర్తిగా తొలగించి, భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా తిరిగి చందనం పూస్తారు. ఈ ఏడాది కూడా స్వామివారికి తొలి గంధాన్ని, పట్టువస్త్రాలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, దేవస్థానం చైర్మన్‌ అయిన గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు సమర్పించారు. తెల్లవారు జామున 2.30 గంటలకు ప్రారంభమైన నిజరూప దర్శనం రాత్రి వరకు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా పండితులు పట్టువస్త్రాలు తీసుకువచ్చి సమర్పించారు. మంత్రులు కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీలు శ్రీభరత్‌, సీఎం రమేశ్‌, ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, బండారు సత్యనారాయణమూర్తి, వంశీకృష్ణ శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు కుటుంబంతో సహా శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి నిజరూప దర్శనం చేసుకున్నారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో దర్శనం చేయించాలని అంతరాలయ దర్శనాలను ఉదయం ఐదు గంటల వరకే పరిమితం చేశారు. భక్తులకు గతం కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించారు.

Updated Date - Apr 21 , 2026 | 05:28 AM