Free Skill Courses: గ్రామీణ యువత.. ఉపాధి బాట!
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:22 AM
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా వారి ఉపాధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది.
సీడాప్ ద్వారా 34 కోర్సుల్లో ఉచితంగా శిక్షణ
డీడీయూజీకేవై 1.0లో 10,596 మందికి ఉపాధి
13 వేల మందికి శిక్షణే లక్ష్యంగా 2.0 ప్రారంభం
ఒక్కో అభ్యర్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు రూ.60 వేలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా వారి ఉపాధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన (డీడీయూజీకేవై)ను సమర్థంగా అమలుచేస్తున్న సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెట్ ఇన్ ఏపీ (సీడాప్) సంస్థ... యువతకు పూర్తి ఉచిత శిక్షణ అందించడంతో పాటు వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో డీడీయూజీకేవై 2.0ను ఈ నెల 1న ప్రారంభించింది. దీనిలో భాగంగా 13వేల మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఈ శిక్షణ పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో ఉంటుంది. ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీల ద్వారా సీడాప్ ఈ పథకాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వంద శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిని నిర్వహించే ఏజెన్సీలే శిక్షణ పొందే యువతకు వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రతి కోర్సు కనీసం 90 రోజులు ఉంటుంది. సెలవులతో కలిపి కోర్సు పూర్తి కావడానికిదాదాపు 4నెలలు పడుతోంది. శిక్షణ కేంద్రాలకు సమీపంలోనే వసతి ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా శిక్షణ పొందే అవకాశం లభిస్తోంది. ఒక్కో అభ్యర్థిపై కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం సగటున రూ.60వేలు ఖర్చు చేస్తోంది.
జర్మనీలోనూ ఉద్యోగాలు
హెల్త్‌కేర్, ఎలక్ర్టికల్ రంగాల్లో జర్మనీలోనూ సీడాప్ ఉద్యోగావకాశాలు కల్పించింది. ఇందుకోసం తొలుత 191 మందికి జర్మన్ భాషపై శిక్షణ ఇచ్చింది. వారిలో 67 మంది నర్సులు జర్మన్‌లో బీ2 లెవెల్‌ను పూర్తిచేశారు. 31 మందికి జర్మనీలో ఉద్యోగాలు లభించాయి. వారిలో 12 మంది ఉద్యోగాల్లో చేరగా, మరో 19 మంది ఫిబ్రవరిలో వెళ్తున్నారు. మరో 60 మంది నర్సులు జర్మన్ భాష నేర్చుకుంటున్నారు. 17 మంది ఎలక్ర్టీషియన్లు ఏ2 స్థాయి శిక్షణ పూర్తిచేసుకున్నారు. వారికీ ఆ దేశంలో ఉద్యోగాలు వచ్చాయి. నెలకు రూ.2.6 లక్షల జీతం వారికి అందుతోంది. సీడాప్ ద్వారా శిక్షణ పొందినవారికి గత ప్రభుత్వంలో 75శాతం మేర ఉద్యోగాలు వచ్చాయి. దానిని కూటమి ప్రభుత్వం 77 శాతానికి పెంచింది. రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో గుంటూరులో 1,566 మంది, కృష్ణాలో 1,050, ఎన్టీఆర్‌లో 988, ప్రకాశంలో 673, నెల్లూరులో 426, తిరుపతిలో 300, అనంతపురంలో 238, ఏలూరులో 293, పశ్చిమగోదావరిలో 244, కాకినాడలో 235 మంది ఉన్నారు.
ఉపాధి కల్పన తర్వాత ట్రాకింగ్
శిక్షణ అనంతరం పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు అందిస్తారు. ఆ తర్వాత వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఏజెన్సీలదే. 2025లో 20,106 మందికి శిక్షణ ఇవ్వగా, 10,596 మందికి ఉపాధి లభించింది. డీడీయూజీకేవై 1.0లో ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఉద్యోగం వచ్చిన తర్వాత 3 నెలల పాటు సీడాప్ వారిని ట్రాకింగ్ చేస్తుంది. ఇకనుంచి దానిని 6 నెలలకు పెంచుతున్నారు. అంటే శిక్షణ అనంతరం పొందే ఉద్యోగంపై 6నెలలు పరిశీలన చేస్తారు. దానికి ఏజెన్సీనే బాధ్యత తీసుకుంటుంది. అలాగే సీడాప్ కంట్రోల్ కమాండ్ సెంటర్ ద్వారా శిక్షణను పర్యవేక్షిస్తోంది. శిక్షణ పొందేవారికి ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు విధానం అమలుచేస్తున్నారు.
34 రంగాల్లో శిక్షణ
డీడీయూజీకేవై కింద 34 రంగాల్లో గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. 18-35ఏళ్ల వయసున్న వారు దీనికి అర్హులు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ చదివిన వారికి పలు రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఎలక్ర్టానిక్స్ హార్డ్‌వేర్ అసెంబ్లీ ఆపరేటర్, ఆటోమేటివ్ అసెంబ్లీ అసిస్టెంట్ తదితర కోర్సులకు 8వ తరగతి అర్హతతోనే శిక్షణ కల్పిస్తున్నారు.
ఇంటర్, పాలిటెక్నిక్ పూర్తయిన వారికి రూఫ్‌టాప్ సోలార్ గ్రిడ్ జూనియర్ ఇంజనీర్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
ఇంటర్ అర్హతతో... జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, టూరిజంలో గెస్ట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, లాజిస్టిక్స్‌లో సప్లై చైన్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ క్లెయిమ్స్ కోఆర్డినేటర్, కొరియర్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్... మీడియా- ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో క్యారెక్టర్ డిజైనర్, ఎలక్ర్టానిక్స్‌లో ఈ-వేస్ట్ హ్యాండ్లర్, ఆర్థిక రంగంలో బ్యాంక్ అస్యూరెన్స్ రిలేషన్‌షిప్ అసోసియేట్, బ్యాక్ ఆఫీస్ అసోసియేట్, గ్రీన్ ఎనర్జీలో సోలార్ పీవీ ఇన్‌స్టాలర్, సోలార్ ప్యానెల్ ఇన్‌స్టలేషన్ టెక్నీషియన్ కోర్సుల్లో చేరవచ్చు.
టెన్త్ అర్హతతో... హెల్త్‌కేర్ రంగంలో హోమ్ హెల్త్ ఎయిడ్, ఎలక్ర్టానిక్స్‌లో మల్టీ స్కిల్ టెక్నీషియన్, అసెంబ్లీ లైన్ ఆపరేటర్, టెలికాంలో లైన్ అసెంబ్లర్, బ్రాడ్‌బ్యాండ్ టెక్నీషియన్, కాల్‌సెంటర్ ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.
ఐటీఐ అర్హత కలిగిన వారికి ఆటోమోటివ్ ఐఐవోటీ అప్లికేషన్ టెక్నీషియన్, ఆటోమోటివ్ ఎలక్ర్టీషియన్ టెక్నీషియన్ తదితర కోర్సుల్లో శిక్షణ అందుతోంది.