Share News

సచివాలయ సిబ్బందితో గ్రేడ్‌ 3 ఈవో పోస్టుల భర్తీ

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:08 AM

దేవదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను దేవదాయ శాఖ గ్రేడ్‌-3 ఈవో స్థానాల్లో నియమించుకునే అవకాశం కల్పించింది.

సచివాలయ సిబ్బందితో గ్రేడ్‌ 3 ఈవో పోస్టుల భర్తీ

  • దేవదాయ శాఖకు ప్రభుత్వ ఆదేశం

  • గ్రేడ్‌ 1 పోస్టుల భర్తీకి నో

  • నిరుద్యోగుల ఆశలపై నీళ్లు..!

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయల్లో అదనంగా ఉన్న ఉద్యోగులను దేవదాయ శాఖ గ్రేడ్‌-3 ఈవో స్థానాల్లో నియమించుకునే అవకాశం కల్పించింది. గ్రేడ్‌-3 ఈవో పోస్టులు 104, గ్రేడ్‌-1 ఈవో పోస్టులు ఐదు భర్తీ చేయడానికి అనుమతివ్వాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ప్రభుత్వాన్ని కోరారు. పరిశీలించిన ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ 5, జానియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ మాత్రమే చేపట్టనుంది. గ్రేడ్‌-1, గ్రేడ్‌-3 ఈవో పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. దేవదాయ శాఖలో ప్రభుత్వం కేటాయించిన కోటా కంటే గ్రేడ్‌-1లు అధికంగా ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ నియామకాలకు అనుమతులు ఇవ్వలేదు. గ్రేడ్‌-3 ఈవో పోస్టులను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఎక్స్‌ ఆఫిషియో కార్యదర్శి ఎం.హరిజవహర్‌లాల్‌ ఒక మెమో జారీ చేశారు. కాగా, ఇప్పటికే ఎపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం చేపడుతున్న నియామకాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేవదాయ శాఖ గ్రేడ్‌ - 3 ఈవో పోస్టులపై నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అధికారులు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని, ఆ పోస్టులను కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 05:17 AM