Share News

ఇప్పుడు గవర్నర్లే ప్రతిపక్షం!

ABN , Publish Date - Jan 26 , 2026 | 04:06 AM

రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉన్న గవర్నర్లే ఇప్పుడు శాసనసభల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆక్షేపించారు.

ఇప్పుడు గవర్నర్లే ప్రతిపక్షం!

  • అసెంబ్లీ నుంచి వాకౌట్లు చేస్తున్నారు

  • న్యాయవ్యవస్థతో రాజ్యాంగానికి ముప్పు

  • నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తరాదిన పెరిగే సీట్లు 158

  • దక్షిణ భారతంలో పెరిగేది 24 స్థానాలే

  • సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి వెల్లడి

విజయవాడ, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉన్న గవర్నర్లే ఇప్పుడు శాసనసభల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి ఆక్షేపించారు. సాధారణంగా గవర్నర్లు ప్రసంగాలు చేసేటప్పుడు ప్రతిపక్షాలు వాకౌట్‌, నిరసన తెలపడం చేస్తాయని.. నేడు వాటిని గవర్నర్లే చేసి చూపిస్తున్నారని విమర్శించారు. జనవిజ్ఞాన వేదిక(జేవీవీ), ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌(ఐలూ) ఆధ్వర్వంలో విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ‘భారత రాజ్యాంగం-సవాళ్లు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. తొలుత అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేవీవీ ప్రచురించిన ‘భారత రాజ్యాంగం-ముఖ్యాంశాలు’ పుస్తకాన్ని ఆయన, ‘రాజ్యాంగ నిర్మాణం-పీఠిక’ పుస్తకాన్ని జేవీవీ వ్యవస్థాపకుడు బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే దానికి రకరకాల సవాళ్లు విసురుతున్నాయన్నాయని, వీటిలో న్యాయ వ్యవస్థ కూడా ఉందన్నారు. ‘ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ఏమీ చదవకుండా వాకౌట్‌ చేశారు. కర్ణాటక గవర్నర్‌ ప్రసంగంలోని మొదటి వాక్యం, చివరి వాక్యం చదివి వెళ్లిపోయారు. కేరళ గవర్నర్‌ ఏకంగా తాను రాసుకున్నదే చదువుతానని చెప్పారు. రాజ్యాంగాన్ని పది రెట్లు పెంచినా, తగ్గించినా.. పాలనా విధానాల ద్వారానే దాని మౌలిక స్వరూపం పూర్తిగా ధ్వంసమవుతుందని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. ఇప్పుడదే జరుగుతోంది’ అని తెలిపారు. తమిళనాడులోని మదురైలో దీపం వివాదాన్నీ ప్రస్తావించారు. పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెడుతుందో చివరి క్షణం వరకు ఎంపీలకు తెలియడం లేదన్నారు. ఎజెండాలో లేని అంశాలను స్పీకర్‌ అనుమతితో సప్లిమెంటరీ అంశంగా ప్రవేశపెడుతున్నారని..


ఈ విధంగానే ‘వీబీ:జీరామ్‌జీ’ బిల్లును తీసుకొచ్చారని ఆరోపించారు. ఇలాంటి విధానాలతో సమాఖ్య వ్యవస్థకు ప్రమాదమని హెచ్చరించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌) ఎవరికోసమని మాజీ న్యాయమూర్తి నిలదీశారు. నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యన్‌సేన్‌కు కూడా నోటీసులివ్వడాన్ని ప్రశ్నించారు. కేంద్రం చేయబోతున్న పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తరాది రాష్ట్రాలకే ఎక్కువ మేలు జరుగుతుందని తెలిపారు. ‘కేంద్రం లోక్‌సభ నియోజకవర్గాలను 821 స్థానాలకు పెంచబోతోంది. యూపీలో ఇప్పుడున్న 80 స్థానాలు 2031లో 137కి పెరుగుతాయి. ఏడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్న 204 స్థానాలు 362కి చేరతాయి. అంటే 158 సీట్లు పెరుగుతాయి. అదే దక్షిణాదిన 153కు పెరుగుతాయి. ఇక్కడ పెరుగుదల 24 స్థానాలే’ అని తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కమిషన్‌ ఏర్పడినప్పుడు.. హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బిహార్‌, యూపీ రాష్ట్రాలు కొత్త సమస్యను సృష్టిస్తాయని అంబేడ్కర్‌ చెప్పారని అన్నారు. ఒక్క ఓటు తేడాతోనే హిందీ అధికార భాష అయిందని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌, ఐలూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్‌, కార్యదర్శి నల్లూరి మాధవరావు, విట్‌ న్యాయ కళాశాల డీన్‌ ప్రొఫెసర్‌ చక్కా బెనర్జీ, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం వివిధ అంశాలపై ప్రసంగించారు.

Updated Date - Jan 26 , 2026 | 04:07 AM