తెలుగు వైభవాన్ని విస్తరింపజేయాలి
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:13 AM
గోదావరి తీరాన, పచ్చని పొలాలతో, సంప్రదాయ సౌందర్యంతో వెలిగే కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచిందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.
నేటితరం పిల్లలకు తెలుగు అలవాటు చేయాలి.. ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపు
ఇంటర్ వరకూ తెలుగు తప్పనిసరి: స్పీకర్ అయ్యన్న
తెలుగుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి: తనికెళ్ల భరణి
అమలాపురంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం
అమలాపురం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): గోదావరి తీరాన, పచ్చని పొలాలతో, సంప్రదాయ సౌందర్యంతో వెలిగే కోనసీమ తెలుగు భాషా సంస్కృతికి నిలయంగా నిలిచిందని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని కిమ్స్ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కిమ్స్ అధినేత కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుశాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, కంభంపాటి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హరిబాబు మాట్లాడుతూ తెలుగు ఒక భాష మాత్రమే కాదని, అది మన జీవం, శ్వాస, గుర్తింపని అభివర్ణించారు. తెలుగు వైభవాన్ని విస్తరింపజేయాలని అన్నారు. విద్య, ఉద్యోగం, సాంకేతిక రంగాల్లో ఇతర భాషల అవసరం ఉన్నా మాతృభాషను పక్కన పెట్టడం సమంజసం కాదన్నారు. ఏపీలో పుట్టిన ప్రతిఒక్కరూ తెలుగులోనే మాట్లాడాలని సూచించారు. నేటితరం పిల్లలకు తెలుగులో మాట్లడటం, చదవడం తప్పనిసరిగా అలవాటు చేయాలని హరిబాబు కోరారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, మాతృభాష పరిరక్షణకు ప్రతిఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ తెలుగు పాఠ్యాంశం తప్పనిసరిగా ఉండాలని, ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగువారు ఉన్నారని, వారంతా తెలుగులోనే మాట్లాడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నవారు మాత్రం మాతృభాషలో మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ నేత రామ్‌మాధవ్ మాట్లాడుతూ తెలుగు భాష జీవించాలంటే చదివే వారితో పాటు రాసేవారు కూడా అవసరమేనని తెలిపారు. యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తెలుగు మహాసభలు యువతకు ఒక ప్రత్యేక సందేశాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
తెలుగు మాధ్యమంలో చదివించాలి: గరికపాటి
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రసంగిస్తూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ తెలుగు మాధ్యమాన్ని కొనసాగించినప్పుడే భాషకు గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని తెలుగు మాధ్యమంలో చదివించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మరో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రకృతి అందచందాలతో అలరాలే కోనసీమకు కేంద్ర బిందువైన అమలాపురం ప్రపంచ తెలుగు మహాసభలకు వేదిక కావడం పూర్వ జన్మ సుకృతమేనని అన్నారు. సినీనటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ మన పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. శానసమండలి చైర్మన్ మోషేన్‌రాజుమాట్లాడుతూ వెయ్యేళ్ల నాటి తెలుగు భాష చస్తే జాతి చస్తుందన్న పెద్దల మాటలను గుర్తుంచుకోవాలని అన్నారు. పిల్లలకు అమ్మ భాషలోని తియ్యదనాన్ని రుచి చూపించడమే మన బాధ్యతని చెప్పారు. సీపీఐ జాతీయ నేత కె.నారాయణ మాట్లాడుతూ తమిళనాడులో తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నారని తెలిపారు. తొలిరోజు సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, పలువురు ఎమ్మెల్సీలు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, గిడ్డి సత్యనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి, రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పూల త్రివిక్రమ్, ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్‌ఆలీషా పలువురు కవులు, ప్రముఖులు పాల్గొన్నారు.