Share News

విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభ్యాసాన్ని పెంచాలి

ABN , Publish Date - Mar 08 , 2026 | 06:24 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, రోబోటిక్స్‌, నానో టెక్నాలజీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పునరుత్పాదక శక్తి, ఈ-మొబిలిటీ వంటి రంగాల్లో...

విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభ్యాసాన్ని పెంచాలి

  • గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

  • ఘనంగా మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం

  • డీఆర్‌డీవో రిటైర్డ్‌ శాస్త్రవేత్త శశికళ సిన్హాకు డాక్టరేట్‌ ప్రదానం

తిరుపతి(టీటీడీ/విశ్వవిద్యాలయాలు), మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీస్‌, రోబోటిక్స్‌, నానో టెక్నాలజీ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, పునరుత్పాదక శక్తి, ఈ-మొబిలిటీ వంటి రంగాల్లో విశ్వవిద్యాలయాలు నైపుణ్య, బహుళ ఆధారిత అభ్యాసాన్ని పెంచాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. నాలెడ్జ్‌ ఎకానమీతో పాటు భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు ఇటువంటి చొరవ ఎంతో అవసరమన్నారు. దేశంలోనే తొలి క్వాంటమ్‌ వ్యాలీ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టిని చాటుకుందని ప్రశంసించారు. శనివారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయం 22వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్‌ హోదాలో పాల్గొన్న గవర్నర్‌ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత విద్యావిధానాన్ని బలోపేతం చేయడంతోపాటు మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. స్కిల్‌ డెవల్‌పమెంట్‌, పరిశోధన, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్‌ వంటి అంశాలకు 2020 జాతీయ విద్యా విధానం ప్రాఽధాన్యత ఇచ్చిందన్నారు. డిజిటల్‌ గవర్నెన్స్‌, స్కిల్‌ ఆధారిత విద్య, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా సైన్స్‌ తదితరాల కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుంటోందని వెల్లడించారు. ఈ రంగాల్లో యువతుల పాత్ర ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు. ఈసందర్భంగా డీఆర్‌డీవో రిటైర్డ్‌ శాస్త్రవేత్త శశికళ సిన్హాకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. స్నాతకోత్సవంలో 102మంది విద్యార్థినులకు బంగారు పతకాలు, 23 పుస్తక, 7 నగదు బహుమతులను గవర్నర్‌ అందజేశారు.

Updated Date - Mar 08 , 2026 | 06:25 AM