ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి: గవర్నర్
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:33 AM
స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంపై విద్యార్థులు దృష్టిసారించాలని, డిగ్రీ పట్టాలతో బయటకు వెళ్లేవారు ఉద్యోగాల కోసం చూడకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగి ఉద్యోగాలు..
విశాఖలో ఘనంగా జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవం
విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేయడంపై విద్యార్థులు దృష్టిసారించాలని, డిగ్రీ పట్టాలతో బయటకు వెళ్లేవారు ఉద్యోగాల కోసం చూడకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాలులో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) తొలి స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్ట్‌పలు వైపు అడుగులు వేయడం ద్వారా దేశాభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ-జేవీ క్యాంప్‌సలో ఉన్నత విద్యా ప్రమాణాలతో బోధన జరుగుతోందని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్ గ్రాండ్ ఫినాలేలో వర్సిటీ విద్యార్థులు విజేతలుగా నిలవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. బ్లాక్ చెయిన్ ఆధారిత ట్యాంపర్ ప్రూఫ్ డిగ్రీ వ్యవస్థను అమలు చేయాలని వర్సిటీ ప్రతిపాదించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి ఒక్కరికీ విజయం సిద్ధించడంతోపాటు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ సీఈవో మయూర్ పట్నాలకు గౌరవ డాక్టరేట్‌ను, మరో 15 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. మొత్తం వర్సిటీలో 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సులు పూర్తి చేసిన 34,896 మంది విద్యార్థులు (ప్రత్యక్షంగా, వర్చువల్‌గా) పట్టాలను అందుకున్నారు. వీరిలో 50 మంది విద్యార్థులకు బంగారు పతకాలను, మరో ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ వీవీ సుబ్బారావు, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.