ప్రజల్లో మళ్లీ విశ్వాసం!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:26 AM
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం చరిత్రాత్మకమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కొన్నేళ్ల పాటు రాష్ట్రానికి దశ....
కొన్నేళ్లు రాష్ట్రానికి దిశ, దశా లేదు
రాజధాని పనులు నిలిచిపోయాయి
పెట్టుబడిదారుల్లో నమ్మకం పోయింది
కూటమి ప్రభుత్వ దిద్దుబాటుతో ఫలితాలు కనిపిస్తున్నాయి: గవర్నర్
అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరుపుకోవడం చరిత్రాత్మకమని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కొన్నేళ్ల పాటు రాష్ట్రానికి దశ, దిశ లేకుండా రాజధాని ప్రాజెక్టు పనులు నిలిచిపోయి, ఆర్థిక విశ్వాసం దెబ్బతిందని.. రాజధాని నిర్మాణం కొనసాగించకపోవడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం సన్నగిల్లిందని చెప్పారు. ఈ సవాళ్ల మధ్య కూటమి ప్రభుత్వం తిరిగి పనులు ప్రారంభించి రాష్ట్ర ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోందన్నారు. ఫలితాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రాజెక్టులు ముందుకు కదులుతున్నాయని.. జనంలో తిరిగి నమ్మకం కలిగిస్తున్నామని తెలిపారు. సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతిలోని నేలపాడులో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయన జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వీడియో సందేశం కూడా విడుదల చేశారు. ‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ సోదర, సోదరీమణులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. భగవంతుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం ఎంచుకున్న పది సూత్రాల అమలుతో లక్ష్యాలను నెరవేరుస్తామన్న నమ్మకం కలుగుతోందన్నారు. ‘తెలుగు ప్రజలు ప్రగతి శిల్పులు.. లక్షల మందిని పోషిస్తున్న మన రైతులు, ప్రమాదాలను లెక్కచేయకుండా సముద్రపు అలలతో పోరాడే మత్స్యకారులు, మనసులను వెలిగించే ఉపాధ్యాయులు, కరుణతో సేవ చేసే ఆరోగ్య కార్యకర్తలు, కొత్త ఆలోచనలకు రూపమిచ్చే మేధావులు, భవిష్యత్‌ను నిర్మిస్తున్న మహిళలను, జీవనోపాధులను సృష్టిస్తున్న వ్యాపారవేత్తలను ఇక్కడ చూస్తున్నాను’ అని ఉద్ఘాటించారు. ప్రతి కుటుంబానికి సాధికారిత కల్పించేందుకు ప్రభుత్వం సూపర్‌సిక్స్ అమలు చేస్తోందని తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..సంపద సృష్టితో సంక్షేమం..
సంపద సృష్టితో విస్తృత సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అందరి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోంది. వృద్ధులకు నెలవారీ పెన్షన్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, డయాలసిస్, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు, ప్రమాద బాధితులకు రూ.15 వేలు చొప్పున అందిస్తున్నాం. దీపం 2.0 ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు 1.08 కోట్ల పేద లబ్ధిదారులకు అందిస్తున్నాం. స్ర్తీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ప్రారంభించాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. బీసీలకు ఈ ఏడాదిలో బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.11,620 కోట్లు అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. వారికి చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతిస్తూ, స్థానిక సంస్థల్లో 34 శాతం కోటాకు కృషి చేస్తున్నాం. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ద్వారా సాయం, సమాచారం, న్యాయం సత్వరమే ప్రజలకు అందిస్తున్నాం. అందరం కలిసి ఆరోగ్య, సంపద, ఆనందకరమైన సమాజాన్ని నిర్మిద్దాం.
2047 నాటికి రూ.3.8 లక్షల కోట్ల ఎకానమీ!
రాష్ట్రప్రభుత్వం పేదరికాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్యను భారీగా పెంచుతోంది. ఇప్పటికే జీరో పావర్టీ, పీ-4 పాలసీని చేపట్టింది. 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రత్యేక అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసింది. 2047 నాటికి రూ.3.8 లక్షల కోట్ల ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వికసిత్ భారత్ విజన్-2047తో కలిసి రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 55 లక్షలకు పెంచాలని టార్గెట్ పెట్టుకుంది. 15 శాతం వృద్ధి రేటు సాధించేందుకు వ్యవసాయం, పరిశ్రమలు, సంక్షేమం, పెట్టుబడుల రంగాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. పెట్టుబడిదారుల అనుకూల విధానాలు తీసుకొచ్చింది. ప్రతిపాదిత పెట్టుబడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2025-26లో దేశంలో ప్రతిపాదిత పెట్టుబడుల్లో నాలుగో వంతు సాధించింది.
- గవర్నర్