Share News

దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్ర బిందువు

ABN , Publish Date - Jun 03 , 2026 | 04:22 AM

ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువని, అందరికీ సమానంగా, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం...

దేశ ప్రగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్ర బిందువు

  • డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 29, 30వ సంయుక్త స్నాతకోత్సవాల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

విజయవాడ, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షణ దేశ ప్రగతికి కేంద్ర బిందువని, అందరికీ సమానంగా, నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో దేశం ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్‌, డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కులపతి ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ 29, 30వ సంయుక్త స్నాతకోత్సవాలకు ఆయన అధ్యక్షత వహించి ప్రసంగించారు. 29వ స్నాతకోత్సవ ముఖ్య అతిథి, హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రుల అరిథ్మియా, ఎలకో్ట్రఫిజియాలజీ డైరెక్టర్‌ డాక్టర్‌ సి.నరసింహన్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (డిఎ్‌ససి) పట్టా ప్రదానం చేశారు. 30వ స్నాతకోత్సవంలో హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రుల కార్డియాక్‌ సైన్సెస్‌ విభాగం డైరెక్టర్‌, హెచ్‌వోడీ డాక్టర్‌ పి.సి.రాత్‌కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌(డి.ఎ్‌ససి) పట్టా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్య, ఆరోగ్య మౌలిక వసతులు, ప్రజారోగ్య సేవల విస్తరణ ద్వారా ఈ లక్ష్య సాధనకు కృషి చేస్తోందని తెలిపారు. యూనివర్సిటీ వైద్య రంగానికి విశిష్ట సేవలను అందించిందని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైద్యారోగ్య విజ్ఞాన విద్యలో విశిష్టమైన వారసత్వాన్ని నిర్మించుకుందని... వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఫిజియోథెరపిస్టులు, అనుబంధ ఆరోగ్య నిపుణులను తీర్చిదిద్దుతూ దేశ విదేశాల్లో ఆరోగ్య సేవల బలోపేతానికి దోహదపడిందని గవర్నర్‌ ప్రశంసించారు. ప్రజాసేవ, మానవ గౌరవ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆశయాలను విద్యార్థులు కొనసాగించాలని సూచించారు. యూనివర్సిటీలో సమీకృత వ్యాధి పర్యవేక్షణ కార్యక్రమం(ఐడీఎ్‌సపీ) కింద ఏర్పాటుచేసిన ‘డిసీజ్‌ మోడలింగ్‌ అండ్‌ డెసిషన్‌ ఇంటెలిజెన్స్‌ సెంటర్‌(డీఎండీసీ)’ను గవర్నర్‌ అభినందించారు. జాతీ య, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యాధుల అంచ నా, విశ్లేషణ, నిర్ణయాల రూపకల్పనలో నిపుణులను తీర్చిదిద్దే ఈ కేంద్రం శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించి విద్య, పరిశోధన, సాంకేతికత, విద్యార్థుల సంక్షేమ రంగాల్లో సాధించిన పురోగతిని వివరించారు.

Updated Date - Jun 03 , 2026 | 04:22 AM