ప్రపంచాన్ని మార్చే ఆయుధం.. విద్య
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:36 AM
ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉద్భోదించారు.
విద్యార్థులు సమాజ శ్రేయస్సుకై పనిచేయాలి
వీఎస్‌యూ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
నెల్లూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని మార్చే శక్తిమంతమైన ఆయుధం విద్య అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉద్భోదించారు. విద్యను వ్యక్తిగత అభివృద్ధి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎ్‌సయూ) 10, 11, 12వ స్నాతకోత్సవ కార్యక్రమం మంగళవారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పాల్గొనగా, తొలుత వైస్ చాన్సలర్ అల్లం శ్రీనివాసరావు వర్సిటీ ప్రగతిని వివరించారు. అనంతరం వైద్య రంగంలో విశేష కృషి చేసిన శాంతా బయోటెక్ అధినేత పద్మభూషణ్ కేఐ వరప్రసాద్‌రెడ్డి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కృషి చేసినందుకు నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ గోబర్దన్ దాస్, ఆక్వా రంగంలో విశేష కృషి చేసినందుకు బీఎమ్మార్ గ్రూప్స్ అధినేత, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావుకు డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు అందజేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ వీఎస్‌యూ ఇటీవల నాక్ నుంచి 3.23 సీజీపీఏతో ఏ గ్రేడు సాధించడం గర్వకారణమని, మరిన్ని ఉన్నత స్థానాలను సాధించే సామర్థ్యం యూనివర్సిటీకి ఉందని తెలిపారు.