గ్రామీణ జీవనోపాధిలో పశుసంపద కీలకం
ABN , Publish Date - Mar 31 , 2026 | 05:24 AM
గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రతలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు.
వెటర్నరీ వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుపతి రూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రతలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ వర్సిటీ 13వ స్నాతకోత్సవం సోమవారం సాయంత్రం సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగింది. చాన్సలర్ హోదాలో హాజరైన గవర్నర్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం ముఖ్యమైన భాగమన్నారు. దేశంలోని 50శాతం మహిళలకు పాడిపరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 15 మంది విద్యార్థులకు 35 బంగారు పతకాలు, ఇద్దరు విద్యార్థులకు రజత పతకాలు, ఒక విద్యార్థికి నగదు బహుమతి ప్రదానం చేశారు.
2న గవర్నర్ పోలవరం సందర్శన
గవర్నర్ అబ్దుల్ నజీర్ 2న పోలవరాన్ని సందర్శిస్తారు. ఈ మేరకు గవర్నర్ పర్యటన షెడ్యూల్ జల వనరుల శాఖకు చేరింది. పోలవరం ప్రాజెక్టు కీలక నిర్మాణాలు పూర్తవుతున్న తరుణంలో ఒకసారి సందర్శించాలంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ను సీఎం కోరారు. ఈ మేరకు ప్రాజెక్టు సందర్శనకు గవర్నర్ సిద్ధమయ్యారు.