పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం
ABN , Publish Date - Jul 06 , 2026 | 05:37 AM
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రైతులను బలి చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ..
ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్
ఏలూరు రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, కార్పొరేట్ సంస్థల లాభాల కోసం రైతులను బలి చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ విమర్శించారు. జిల్లా కేంద్రం ఏలూరులో జరుగుతున్న రైతు మహాసభల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేసి, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) కల్పించాలని డిమాండ్ చేశారు. 2014లో రైతులకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడోస్థానంలో ఉండడం ప్రభుత్వాల వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29న ఢిల్లీలో రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల జాతీయ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ‘జైల్‌భరో’ కార్యక్రమం చేపట్టి రైతాంగ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు.