Share News

నాటు వైద్యం కాదు సర్కార్‌ వైద్యం బతికించింది

ABN , Publish Date - Mar 15 , 2026 | 04:32 AM

‘నా బిడ్డకు నాటు వైద్యమో, పసర మందో ఇప్పిస్తా.. భూమిపై నూకలుంటే బతుకుతుంది.. లేకుంటే చస్తుంది.. అంతేతప్ప సర్కారీ వైద్యం వద్దే వద్దు’ అంటూ ఓ తండ్రి మొండికేశాడు.

నాటు వైద్యం కాదు సర్కార్‌ వైద్యం బతికించింది

  • నూకలుంటే తన బిడ్డ బతుకుతుంది అంటూ గిరిజనుడి బెట్టు

  • తల్లిదండ్రులను ఒప్పించి పసికందును కాపాడిన వైద్యులు

బుట్టాయగూడెం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘నా బిడ్డకు నాటు వైద్యమో, పసర మందో ఇప్పిస్తా.. భూమిపై నూకలుంటే బతుకుతుంది.. లేకుంటే చస్తుంది.. అంతేతప్ప సర్కారీ వైద్యం వద్దే వద్దు’ అంటూ ఓ తండ్రి మొండికేశాడు. అయితే.. అతడిని వైద్యులు ఒప్పించి పసికందుకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.సురేష్ కుమార్‌ కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం ముంజులూరు పంచాయతీ చిలకలూరు కొండరెడ్డి గ్రామానికి చెందిన పట్ల లక్ష్మి ఐదు రోజుల క్రితం పులిరాముడుగూడెం పీహెచ్‌సీలో పండంటి పాపకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు అని తెలియడంతో మెరుగైన వైద్యం అందించడానికి బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని పీఆర్‌ గూడెం వైద్యులు సూచించినా లక్ష్మి అంగీకరించలేదు. పాపకు సర్కారు వైద్యం అందించడానికి తన భర్త శ్రీనివాసరెడ్డికి ఇష్టంలేదని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బుట్టాయగూడెం వైద్యానికి వెళితే తనను కొడతానని భర్త హెచ్చరించాడని లక్ష్మి చెప్పింది. దీంతో మెరుగైన వైద్యం అందించకుంటే పాప ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్‌ జె.సురేష్ కుమార్‌ లక్ష్మి, శ్రీనివాసరెడ్డిలకు చెప్పారు. అయినా శ్రీనివాసరెడ్డి నసుగుతుండడంతో.. మాట వినకుంటే చర్యలు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. దీంతో వారు దారిలోకి వచ్చారు. వెంటనే ఫొటోథెరపీలో ఉంచి వైద్యసేవలు అందించడంతో పాప సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యుడు తెలిపారు. శనివారం డిశ్చార్జి చేశామన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 04:34 AM