Share News

‘కల్తీ’పై చర్యలు తప్పవు

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:56 AM

తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

‘కల్తీ’పై చర్యలు తప్పవు

  • అసెంబ్లీలో మంత్రి ఆనం ప్రకటన

అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : తిరుమల కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారాన్ని ప్రభుత్వం అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణిస్తోందని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో కల్తీ నెయ్యి, లడ్డూ కల్తీ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆయన ప్రకటన చేశారు. తిరుమల లడ్డూ తయారీకి వాడే నెయ్యి కల్తీ వ్యవహారంలో మతపరమైన మనోభావాలు ఇమిడి ఉండటంతో అది ప్రజా ప్రాధాన్యం కలిగిన అంశంగా మారింది. అందువల్ల ప్రభుత్వం 2024 సెప్టెంబరులో సిట్‌ ఏర్పాటు చేసింది. అనంతరం సుప్రీంకోర్టు సూచనల మేరకు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో సిట్‌ను పునర్వ్యవస్థీకరించాం. గత వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే సజావుగా కల్తీ నెయ్యి వ్యవహారం నడిచేందుకు వీలుగా నింబధనలను సడలించింది. ఈ విషయం సిట్‌ విచారణలో వెల్లడైంది. మేం టీటీడీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నాం’’ అని ఆనం తెలిపారు.

నెయ్యిని సృష్టించారు : జ్యోతుల నెహ్రూ

లడ్డూ తయారీలో ఉపయోగించింది అసలు నెయ్యే కాదని, ఒక పదార్థాన్ని సృష్టించి దానికి అనేక రకాల రసాయనాలను కలిపి నెయ్యిగా చూపించి లడ్డూలో ఉపయోగించారని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు.

మహా ప్రసాదంలో దోచేశారు : ధూళిపాళ్ల

తిరుమలలో అన్యమత ప్రచారం, కల్తీ నెయ్యి వ్యవహారం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. లడ్డూలో కల్తీ జరగకపోతే, కల్తీ నెయ్యి సరఫరా కాకపోతే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్డులో కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. తమ వ్యాపారాల కోసం ప్రైవేటు డెయిరీలకు అవకాశం కల్పించి మహాప్రసాదంలో దోపిడికి తెర లేపారన్నారు.


వైఎస్‌ హయాం నుంచే...: కూన రవికుమార్‌

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీయడం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితోనే మొదలైందని ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ఆరోపించారు. 2005 జీవో 338 విడుదల చేసి తిరుమల ఏడు కొండలు కాదు రెండు కొండలే అంటూ, వైఎస్‌ హిందువుల మనోభావాలు దెబ్బ తీశారన్నారు.

హిందూధర్మంపై దాడి ఇది: కాలవ

శ్రీవారి లడ్డూ కల్తీని హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిగా పరిగణించాలని రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. వైఎస్‌ హయాంలో 2006 - 08 మధ్య టీటీడీ చైర్మన్‌గా ఉన్న భూమన తన కూతురు పెళ్లి చర్చిలో చేశారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తిని మళ్లీ 2023లో జగన్‌ టీటీడీ చైర్మన్‌గా నియమించారన్నారు.

పింక్‌ డైమండ్‌పై లోపల వేయాల్సింది: సోమిరెడ్డి

టీటీడీలో లేని పింక్‌ డైమండ్‌ పోయిందని, చంద్రబాబు ఇంట్లో ఉందంటూ ఆరోపణలు చేసినప్పుడే వైసీపీ నేతలను లోపల వేయాల్సింద ని సర్వేపల్లి ఎమ్మెల్యే చంద్రమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 25 , 2026 | 04:56 AM