Share News

Chief Minister Chandrababu: పత్తి రైతుకు సర్కారు అండ

ABN , Publish Date - Jan 15 , 2026 | 03:31 AM

మొంథా తుఫాన్‌ కంటే ముందే ఆరంభమైన ప్రకృతి విపత్తులు ఈ ఏడాది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా పత్తి సాగు ప్రాంతాల్లో వర్షాలు, గాలులు, తేమ ప్రభావం దిగుబడితోపాటు నాణ్యతపైనా పడింది.

Chief Minister Chandrababu: పత్తి రైతుకు సర్కారు అండ

  • సీఎం చొరవతో సీసీఐ నిబంధనల సడలింపు

  • రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన కొనుగోళ్లు

  • ఇప్పటికి 3.22 లక్షల క్వింటాళ్ల సేకరణ

  • 71,710 మందికి దక్కిన మద్దతు ధర

  • ప్రైవేటు వ్యాపారులూ అధిక ధర ఆఫర్‌

  • రాయలసీమకు ఎక్కువ లబ్ధి

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

మొంథా తుఫాన్‌ కంటే ముందే ఆరంభమైన ప్రకృతి విపత్తులు ఈ ఏడాది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా పత్తి సాగు ప్రాంతాల్లో వర్షాలు, గాలులు, తేమ ప్రభావం దిగుబడితోపాటు నాణ్యతపైనా పడింది. పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో ధరలు పడిపోతాయన్న భయం రైతులను వెంటాడింది. అటువంటి సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాలతో పత్తి రైతుకు అండగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపింది. అయితే సీజన్‌ ప్రారంభంలో పరిస్థితి అంత అనుకూలంగా లేదు. తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనల పేరుతో సీసీఐ కొనుగోళ్లలో ముందడుగు వేయలేదు. దీంతో రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందన్న ఆందోళనలో పడ్డారు. క్వింటా పత్తిని రూ.4 వేల నుంచి రూ.5500కు కూడా రైతులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం రాష్ట్రంలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని, సీసీఐ కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీఎం చేసిన విజ్ఞప్తిపై కేంద్రం స్పందించింది. దీంతో సీసీఐ తన వైఖరిని మార్చుకొని కొనుగోళ్లను విస్తరించింది. ఈనెల 5వ తేదీనాటికి గుంటూరు జిల్లాలో 3,314 మంది రైతుల నుంచి 22,793 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది.


కర్నూలు జిల్లాలో 20,992 మంది రైతుల నుంచి 6,54,933 క్వింటాళ్లు ేసకరించింది. విజయనగరం జిల్లాలో 433 మంది రైతుల నుంచి 6,730 క్వింటాళ్లు, మన్యం జిల్లాలో 682 మంది రైతుల నుంచి 10,306 క్వింటాళ్లు, ఎన్‌టీఆర్‌ జిల్లాలో 5,295 మంది రైతుల నుంచి 3,67,661 క్వింటాళ్లు, పల్నాడు జిల్లాలో 3,979 మంది రైతుల నుంచి 2,70,994 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 922 మంది రైతుల నుంచి 70,084 క్వింటాళ్లు కొనుగోలు చేసింది. పత్తి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిగాయి. అక్కడ 36,093 మంది రైతుల నుంచి 16,16,688 క్వింటాళ్ల పత్తిని సీసీఐ తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 71,710 మంది రైతులకు సీసీఐ ప్రకటించిన మద్దతు ధర లభించింది. సీసీఐ కేంద్రాల్లో పత్తి క్వింటాల్‌కు రూ.8,110(మొదటి శ్రేణి నాణ్యత), దిగువ శ్రేణి నాణ్యత కలిగిన పత్తికి రూ.7,710 వరకు మద్దతు ధర లభించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు గణనీయంగా పెరగడం, ముఖ్యంగా విపత్తుల వేళ నిబంధనలు సడలించి కొనుగోళ్లు చేయడం రైతులకు ఊరట నిచ్చింది. కేంద్రంతో సమన్వయం, రాష్ట్ర స్థాయిలో వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.


ఆదోని మార్కెట్‌ కళకళ ..

ఈ ఏడాది ఇప్పటి వరకు సీసీఐ కొనుగోలు చేసిన పత్తిలో ఎక్కువ భాగం రాయలసీమదే కావడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 3.22 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, ఆదోని మార్కెట్‌ నుంచి ఎక్కువ సేకరణ జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. సీసీఐ మద్దతు ధరకు దీటుగా రేటు చెల్లించేందుకు ఇక్కడి ప్రైవేట్‌ వ్యాపారులు ముందుకు రావటం శుభపరిణామంగా కనిపిస్తోంది.

ప్రభుత్వ చొరవ వల్లే: ఇక్కుర్తి, మన్నవ

ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలోనే సీసీఐకి, రాష్ట్రంలోని పత్తి మిల్లుల యాజమాన్యాలకు మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందని ఏపీ కాటన్‌ టీఎంసీ కన్సార్టియం అధ్యక్షుడు ఇక్కుర్తి శివప్రసాద్‌, సంయుక్త కార్యదర్శి మన్నవ హరినాథ్‌బాబు తెలిపారు. ఆ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిందన్నారు. సీఎం కేంద్రానికి లేఖ రాయడంతోపాటు, వ్యవసాయ మంత్రి అచ్చెనాయుడు, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ విజయసునీత అనేక మార్లు సీసీఐ అధికారులతో సమావేశాలు జరిపారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్లే ఎక్కువ మొత్తంలో పత్తి కొనుగోలుకు అవకాశం ఏర్పడిందని, లేకుంటే పత్తి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలేదని పేర్కొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 03:33 AM