Share News

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలు

ABN , Publish Date - May 02 , 2026 | 11:04 PM

‘పది’ ఫలితాల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సా ధించడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్ల ఫలితాలు
విద్యార్థులను సన్మానిస్తున్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు

ఆదోని, మే 2 (ఆంధ్రజ్యోతి): ‘పది’ ఫలితాల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సా ధించడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు. శనివారం ఆదోనిలోని తన స్వగృహంలో నిర్వహించిన కార్యక్రమంలో పదో తరగతి ఫలితాల్లో నియోజకవర్గంలోనే అత్యుత్తమ మార్కులు సాధించిన ఆదోని మున్సిపల్‌ నెహ్రూ మెమోరియల్‌ హైస్కూల్‌ విద్యార్థినులను ఆయన సన్మానించారు. 580 మార్కులు సాధించి నియోజకవర్గ టాపర్‌గా నిలిచిన అంబికతో పాటు 577 మార్కులు సాధించిన మహేశ్వరి, 575 మార్కులు సాధించిన చైత్రలకు శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజ్‌అహ్మద్‌, ఉపాధ్యాయులు సునీల్‌రాజ్‌కుమార్‌లను కూడా ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం బీటీ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోనే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించగలుతున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిన గౌరవమని కొనియాడారు. గతంలో నారా లోకేశ ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు ఫుల్‌ అయ్యాయని గర్వంగా ట్వీట్‌ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నేడు ఆ స్కూళ్ల విద్యార్థులు పది ఫలితాల్లోనూ తమ సత్తా చాటడం పట్ల ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు విద్యాశాఖ మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీటీ టీం సభ్యులు నాగరాజుస్వామి, హుసేన్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 11:04 PM