మళ్లీ లైసెన్సు సర్వేయర్లు!
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:56 AM
గ్రామ సర్వేయర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో నిలిపివేసిన లైసెన్సు సర్వేయర్ వ్యవస్థను పునరుద్ధరించింది
అనుమతి ఇచ్చిన సర్కారు.. ఉత్తర్వులు జారీ
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): గ్రామ సర్వేయర్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో నిలిపివేసిన లైసెన్సు సర్వేయర్ వ్యవస్థను పునరుద్ధరించింది. గతంలో ప్రభుత్వం నుంచి లైసెన్సులు తీసుకుని పనిచేసిన 2,828 మందికి లైసెన్సును పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని సర్వే, సెటిల్‌మెంట్ డైరెక్టర్‌ను ఆదేశిస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ బుధవారం ఉత్తర్వులు(జీఓ 446) జారీ చేశారు. 2003లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు ‘లైసెన్సు సర్వేయర్ల’ విధానం తీసుకొచ్చింది. అప్పట్లో 3,200 మందికి లైసెన్సులు ఇచ్చింది. మరో 1000మందిని వెలుగు ప్రాజెక్టులో భాగంగా లైసెన్సు సర్వేయర్లుగా నియమించింది. అప్పటి నుంచి 2019 వరకు వారు పనిచేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. దాదాపు 11,500 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. లైసెన్సు సర్వేయర్ల వ్యవస్థను బలోపేతం చేయలేదు. వారి లైసెన్సులు పునరుద్ధరించకపోగా ఒక్కొక్కరి నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేసిన ఫీజును కూడా వెనక్కి ఇవ్వలేదు. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మరోసారి లైసెన్సు సర్వేయర్ల అంశం తెరమీదకు వచ్చింది. సర్వే, సెటిల్‌మెంట్ కమిషనర్ పంపిన ప్రతిపాదన మేరకు మళ్లీ లైసెన్సు సర్వేయర్ విధానం చేపట్టాలని రెవెన్యూశాఖ అనుమతి ఇచ్చింది. గతంలో ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకున్న 2,828 మందికి లైసెన్సులు పునరుద్ధరించాలని బుధవారం ఇచ్చిన ఉత్తర్వులో రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. మూడేళ్ల కాలవ్యవధితో లైసెన్సు మంజూరు చేయాలని ఆదేశించింది. అయితే, లైసెన్సుల జారీ కొన్ని పద్ధతులు, విధానాలకు లోబడి చేపట్టాలని సర్వే కమిషనర్‌కు దిశానిర్దేశం చేశారు. లైసెన్సు ఇచ్చేముందు ఆ సర్వేయర్ల గత పనితీరు చరిత్ర, పనివిధానం చూడాలని స్పష్టం చేశారు. వారి నుంచి లైసెన్సు ఫీజు వసూలు చేయాలని పేర్కొన్నారు. అలాగే, వారికి విధిగా జీఎన్‌ఎ్‌సఎస్, డీజీపీఎస్, కార్స్, క్యూజీఐఎ్‌సల వంటి సాంకేతికతపై శిక్షణ ఇవ్వాలని, రాతపరీక్షలు నిర్వహించాలని వివరించారు. ఎంపికైన వారికి సర్వీసు చార్జీని ఒక్కో దరఖాస్తుకు రూ.750 చొప్పున చెల్లించేలా విధివిధానాలు రూపొందించాలని పేర్కొన్నారు.