ఆస్తి విభజన దస్తావేజుల నిబంధనలకు సవరణలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 04:14 AM
వారసత్వ, ఉమ్మడి ఆస్తుల విభజన దస్తావేజుల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను ప్రభుత్వం సోమవారం సవరించింది.
అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): వారసత్వ, ఉమ్మడి ఆస్తుల విభజన దస్తావేజుల రిజిస్ర్టేషన్‌కు సంబంధించి కొన్ని నిబంధనలను ప్రభుత్వం సోమవారం సవరించింది. 2021లో వారసత్వ ఆస్తుల విభజన దస్తావేజుల్లో ఎవరికి ఎక్కువ ఆస్తి దక్కుతుందో వారు ఎక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించాలని, ఒక కుటుంబం ఉమ్మడి సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తుల విభజనకు ఎక్కువ స్టాంపు డ్యూటీ చెల్లించాలని అప్పటి ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నిబంధనలను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం సోమవారం జీవో ఇచ్చింది. వారసుల మధ్య ఆస్తుల విభజన సమానంగా ఉన్నా, లేకున్నా... వారసత్వ ఆస్తి అయినా, ఉమ్మడి సంపాదనతో కొనుగోలు చేసిన ఆస్తికైనా విభజన దస్తావేజుల స్టాంపు డ్యూటీ ఒకేరకంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే, గతంలో వారసత్వ ఆస్తుల విభజన దస్తావేజులకు సంబంధించి ఇచ్చిన నిబంధనల్లో హిందూ అవిభాజ్య కుటుంబాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇప్పుడు దీన్ని కూడా ఉపసంహరించుకున్నారు. అన్ని కుటుంబాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని జీవో ద్వారా వెల్లడించారు.