Share News

ఎట్టకేలకు కోతల్లేకుండా ఫీజుల విడుదల

ABN , Publish Date - Mar 13 , 2026 | 05:39 AM

ఫీజుల విడుదల ప్రక్రియలో పెట్టిన ‘వడ్డీ’ మినహాయింపు మెలిక, దాదాపు నెల రోజుల జాప్యంపై వచ్చిన విమర్శలతో ఉన్నత విద్యా శాఖ అధికారులు పొరపాటును సరిదిద్దుకున్నారు.

ఎట్టకేలకు కోతల్లేకుండా ఫీజుల విడుదల

  • బకాయిల చెల్లింపులో ‘వడ్డీ’ మెలికతో ఆలస్యం

  • ఉన్నత విద్యాశాఖ తీరుతో నెల రోజుల జాప్యం

  • రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నందున

  • 7.5శాతం వడ్డీ మినహాయింపునకు ప్రతిపాదన

  • యాజమాన్యాల ఫిర్యాదుతో స్పందించిన సీఎం

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఫీజుల విడుదల ప్రక్రియలో పెట్టిన ‘వడ్డీ’ మినహాయింపు మెలిక, దాదాపు నెల రోజుల జాప్యంపై వచ్చిన విమర్శలతో ఉన్నత విద్యా శాఖ అధికారులు పొరపాటును సరిదిద్దుకున్నారు. కాలేజీ యాజమాన్యాల ఫిర్యాదులపై సీఎం స్పందనతో ఎట్టకేలకు కోతల్లేకుండా మొత్తం ఫీజుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది. 2024-25కి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు ప్రభుత్వం ఫిబ్రవరి 10న రూ.1,200 కోట్ల విడుదలకు బీఆర్‌వోలు విడుదల చేసింది. దీంతో వెంటనే ఫీజులు తమ ఖాతాల్లో జమవుతాయని కాలేజీ యాజమాన్యాలు ఆశించాయి. కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇక్కడొక మెలిక పెట్టారు. ప్రభుత్వం వద్ద నిధుల్లేకపోయినా రుణాలు తీసుకొచ్చి బకాయిలు ఇస్తున్నందున.. ఆ రుణంపై 7.5 శాతం వడ్డీ కాలేజీలు భరించాలని ప్రతిపాదన పెట్టారు. పైస్థాయి ఆదేశాలతో ఈ ప్రతిపాదన పెట్టారా? లేక అధికారుల నిర్ణయమా? అనేదానిపై తీవ్ర చర్చ జరిగింది. అనంతరం ఈ ప్రతిపాదనపై పలు దఫాలుగా యాజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. ఓ దశలో ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రుణం తీసుకున్నట్లుగా అగ్రిమెంట్‌ రాయాలని కాలేజీలకు ప్రతిపాదించారు. దీనిని యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.


మాకు రావాల్సిన బకాయిలను మేం రుణం తీసుకున్నట్లు చూపడం ఏంటని ప్రశ్నించాయి. రుణం తీసుకున్నట్టు చూపించినా, ఆ రుణాన్ని ఏడాదిలో సాంఘిక సంక్షేమ శాఖ తిరిగి చెల్లిస్తుందని, ఆ భారం మీపై పడదని చెప్పినా కాలేజీలు అంగీకరించలేదు. మరోవైపు వడ్డీ కూడా భరించాలనే ప్రతిపాదనను యాజమాన్యాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించాయి. రూ.1,200 కోట్లపై రూ.90 కోట్లు కాలేజీలు కోల్పోవాల్సి వచ్చేది. నెల రోజులు గడిచినా ఈ పంచాయతీ తేలలేదు. కొన్ని కాలేజీల యాజయాన్యాలు సోమవారం ముఖ్యమంత్రికి దాదాపు 250 ఈ-మెయిళ్ల ద్వారా ఫిర్యాదు చేశాయి. తమకు రావాల్సిన బకాయిలను తీసుకోవాలంటే వడ్డీ కట్టాలంటున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశాయి. వెం టనే స్పందించిన సీఎం చంద్రబాబు.. వడ్డీ ప్రతిపాదనపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ మొదటి దశగా బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ.300 కోట్ల ఫీజులను మంగళవారం విడుదల చేసింది. ఉగాదిలోగా మిగిలిన రూ.900 కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిపై కాలేజీ యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Mar 13 , 2026 | 05:39 AM