AP Government: పట్టు రైతుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:27 AM
గత ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువైన పట్టు పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఊతమిస్తోంది. పట్టు రైతులకు కేంద్ర ప్రాయోజిత పథకం ‘సిల్క్ సమగ్ర’ ద్వారా లబ్ధి చేకూరుస్తోంది.
వరంగా మారిన సిల్క్ సమగ్ర పథకం సాంకేతికత, నాణ్యత, ఉత్పాదకత పెంపు
పెండింగ్‌లో ఉన్న రూ.14 కోట్లు విడుదల
ఏడాదిలోనే పట్టుగూళ్ల ధరలు రెట్టింపు
తాజాగా క్లస్టర్ విధానం అమలుకు నిర్ణయం
కావాల్సినంత పట్టు ఉత్పత్తే లక్ష్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువైన పట్టు పరిశ్రమకు కూటమి ప్రభుత్వం ఊతమిస్తోంది. పట్టు రైతులకు కేంద్ర ప్రాయోజిత పథకం ‘సిల్క్ సమగ్ర’ ద్వారా లబ్ధి చేకూరుస్తోంది. కొత్తగా క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏడాదిలోనే పట్టుగూళ్ల(కొకూన్) ధరలు రెట్టింపు అయ్యాయి. ‘సిల్క్ సమగ్ర’ పట్టు పురుగుల పెంపకం రైతులకు వరంగా మారింది. పట్టు పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి, నాణ్యత పెంపుదల, పెట్టుబడి సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, ఉత్పాదకతను పెంచడం ఈ పథకం ఉద్దేశం. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న రైతులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డు సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కిసాన్ నర్సరీల పెంపకం, మల్బరీ తోటల పెంపకం, పట్టు పురుగుల పెంపకం షెడ్ల నిర్మాణం, పెంపకం పరికరాల సరఫరా, నాణ్యమైన క్రిమి సంహారక మందులు, రీలింగ్, ట్విస్టింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డు సహాయం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి పథకం కింద క్రిమి సంహారక మందులు, యాంత్రీకరణ, బైవోల్టిన్ కొకూన్‌లు, టస్సర్ కొకూన్‌ల ఉత్పత్తి, ముడి పట్టు ఉత్పత్తి, టస్సర్ విత్తనాల సేకరణ, గిరిజన రైతులకు వేతనాలకు ప్రభుత్వం సాయం చేస్తోంది.
ఈ పథకం కింద చేసే సహాయంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు కేంద్రం 65శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం ఇస్తే.. లబ్ధిదారులు 10శాతం భరించాల్సి ఉంటుంది. ఇతర వర్గాల రైతులకు కేంద్రం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం ఇస్తే.. లబ్ధిదారులు 25శాతం భరించాల్సి ఉంటుంది. ఈ పథకంలో గతంలో పెండింగ్‌లో ఉన్న రూ.14 కోట్లను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. అలాగే పిచికారి మందులకు రూ.2కోట్లు, యాంత్రీకరణకు రూ.4 కోట్లు విడుదల చేసింది. పట్టు నేత్రికలకు కూడా నిధులను విడుదల చేసింది.
పట్టు క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు
రాష్ట్రంలో పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం కొత్తగా క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పట్టు పురుగుల పెంపకం ఎక్కువగా ఉన్న రాయలసీమలోని కుప్పం, పలమనేరు, మదనపల్లె, మడకశిర, హిందూపురం, ధర్మవరం, కోస్తాలోని చేబ్రోలు, అరకులో పట్టు క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. చేనేత పరిశ్రమకు అవసరమైన పట్టు దారాన్ని రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో పట్టు పరిశ్రమను క్రియాశీలం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కర్ణాటక నుంచి లేదా రాష్ట్రంలోని ప్రొద్దుటూరు, చేబ్రోలులోని నేషనల్ హ్యాండ్‌ల్యూమ్స్ సెంటర్ల నుంచి పట్టు దారాన్ని చేనేత పరిశ్రమదారులు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సిల్క్ సమగ్ర పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం, పట్టు రైతుల్ని ప్రోత్సహించడం వల్ల రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే పట్టు గూళ్ల (కొకూన్)ల ధర బాగా పెరిగింది. కొవిడ్ సమయంలో కిలో రూ.200-250 ఉండగా, గతేడాది నుంచి రూ.750-800 వరకు చేరింది. సగటు ధర రూ.700 పలుకుతోంది. ప్రతి రెండు నెలలకు ఐదు సార్లు కొకూన్ తీయడం వల్ల పట్టు రైతులకు నికర ఆదాయం వస్తోంది.