Share News

కోనసీమ ఇసుక దందాపై సర్కారు సీరియస్‌

ABN , Publish Date - Mar 31 , 2026 | 06:05 AM

కోనసీమలో వైసీపీ మాజీ ఎంపీ చేస్తున్న ఇసుక దందాను సర్కారు తీవ్రంగా పరిగణించింది. సదరు నేతకు లబ్ధిచేకూర్చేలా కీలక అధికారి, ఇద్దరు ప్రజాప్రతినిధులు పనిచేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది.

కోనసీమ ఇసుక దందాపై సర్కారు సీరియస్‌

  • సమగ్ర విచారణకు సీఎం ఆదేశం .. ఉమ్మడి తనిఖీలు నిర్వహించండి

  • పారదర్శక నివేదిక ఇవ్వాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశం

  • ఇసుక నిధిని వినియోగించానని అంగీకరించిన కోనసీమ కలెక్టర్‌

  • తదుపరి చర్యలకు సర్కారు సమాయత్తం

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన

అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కోనసీమలో వైసీపీ మాజీ ఎంపీ చేస్తున్న ఇసుక దందాను సర్కారు తీవ్రంగా పరిగణించింది. సదరు నేతకు లబ్ధిచేకూర్చేలా కీలక అధికారి, ఇద్దరు ప్రజాప్రతినిధులు పనిచేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. ‘కోనసీమలో కుమ్మేస్తున్నారు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై స్పందించింది. కోనసీమలో ఏం జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు. ఇసుక అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపించాలని గనుల శాఖను ఆదేశించారు. పారదర్శకమైన నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా తక్షణ చర్యలు తీసుకుంటామని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్‌ కుమార్‌ మీనాకు సూచించారు. అక్రమ రీచ్‌లు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి? వాటి వెనుక ఉన్నది ఎవరు? ఎంతకాలం నుంచి ఈ దందా సాగుతుందో కనిపెట్టేందుకు ఉమ్మడి తనిఖీలు చేపట్టి అన్ని విషయాలు తేల్చాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, ఇతర అంశాలపై సోమవారం సాయంత్రానికే గనుల శాఖ డైరెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలోని అంశాలపై సీఎం ఉన్నతాధికారులతో మాట్లాడారని తెలిసింది.


‘‘ఉచిత ఇసుక పథకాన్ని అడ్డంపెట్టుకొని వైసీపీ నేతలు ఇసుక దోపిడీ చేయడం ఏమిటి? వారికి అధికారులు వంతపాడటం ఏమిటి? అసలు కోనసీమలో ఏం జరుగుతోంది? ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో పేర్కొన్న అంశాలు, అక్రమ రీచ్‌ల ఏర్పాటుపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వండి’’ అని ఆదేశించారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రి కార్యదర్శి రాజమౌళి.. మీనాతో, గనుల శాఖ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిష్పాక్షిక విచారణ చేసి నివేదిక సమర్పించాలని కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గనుల శాఖ డైరెక్టరేట్‌కు కోనసీమ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) ప్రతాప్‌ను పిలిపించారు. కోనసీమ జిల్లా పరిధిలో 20 నెలల్లో ఇసుక, మట్టి తవ్వకాలు, రీచ్‌ల ఏర్పాటు, అనధికారిక రీచ్‌ల నిర్వహణ, సీనరేజీ నిధుల వినియోగం వంటి కీలక అంశాలపై ఫైళ్లతో సహా రావాలని ఆదేశించారు. వాటిని గనుల శాఖ డైరెక్టర్‌ స్వయంగా పరిశీలించారు.


మరో ఖాతాలో సీనరేజీ నిధులు

ఇసుక తవ్వకాల సందర్భంగా ప్రభుత్వానికి సీనరేజీ, ఇతర ఫీజులు వస్తుంటాయి. వాటిని విధిగా గనుల శాఖ హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌లో జమ చేయాలి. నేరుగా అవి ప్రభుత్వానికే వెళ్తాయి. అయితే గత కొన్ని నెలలుగా సీనరేజీ ఫీజులను మరో ఖాతాలో జమ చేసినట్లు గనులశాఖ డైరెక్టర్‌ గుర్తించారు. సీనరేజీ ఫీజును ఇతర అవసరాలకు వినియోగించాలన్నా, ఇతర ఖాతాల్లో జమ చేయాలన్నా ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే మరో ఖాతాలో జమ చేసి, ఆ నిధులను ఖర్చుపెట్టినట్లుగా గుర్తించారు. ఇదెలా జరిగిందని ఆరా తీస్తుండగానే.. కోనసీమ కలెక్టర్‌ నుంచి మీనా, చంద్రశేఖర్‌కు నివేదికలు అందాయు. సీనరేజీ ఫీజుల కింద వచ్చిన నిధులను మరో ప్రభుత్వ ఖాతాలో జమ చేసి అందులో కొంతమేర పాలనా పరమైన అత్యవసర అవసరాలకు వినియోగించినట్లుగా కలెక్టర్‌ పేర్కొన్నారని తెలిసింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు ఆ నిధులను ఖర్చు చేశామని అందులో ప్రస్తావించినట్లు సమాచారం. అయితే సీఎం సహా ఇతర వీఐపీలు జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు ఖర్చుచేసేందుకు ప్రత్యేకంగా నిధులు ఉంటాయి. ఇసుక సీనరేజీ నిధిని వినియోగించడానికి వీల్లేదని అధికారులు చెబుతున్నారు.


వెల్లువెత్తిన ఫిర్యాదులు

కోనసీమలో ఇసుక దందాను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత సోమవారం ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. 18 చోట్ల అక్రమ ఇసుక రీచ్‌ల ఏర్పాటు, తవ్వకాలు, రవాణా, నిత్యం లారీల రాకపోకలపై వీడియోలు, ఫొటోలను జతచేసి పర్యావరణాన్ని ఎంతగా గుల్లచేస్తున్నారో తెలిపేలా ఫిర్యాదులు ఇచ్చారు. ఇందులో జిల్లా కీలక ఉన్నతాధికారిపైనే మూడు ఫిర్యాదులు ఉన్నాయి. వైసీపీ నేతతో ఆయనకున్న అనుబంధం, అక్రమ తవ్వకాలకు ఆయన అందిస్తున్న ప్రత్యక్ష, పరోక్ష సహకారాన్ని తెలుపుతూ విచారణ చేయాలని కోరారు.

Updated Date - Mar 31 , 2026 | 06:07 AM