ఉన్నత విద్యలో మళ్లీ ‘ఫీజుల కమిటీ‘!
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:39 AM
ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పులు జరగనున్నాయి. ‘ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్’ను ‘ఫీజుల నియంత్రణ కమిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
కీలక మార్పులకు ప్రభుత్వం చర్యలు
‘ఫీజుల నియంత్రణ కమిటీ’గా మారనున్న ఉన్నత విద్య నియంత్రణ,
పర్యవేక్షణ కమిషన్.. పరిమిత అధికారాలతో నూతన విధానం
పారదర్శకత పెంచే దిశగా మార్పులు
అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖలో కీలక మార్పులు జరగనున్నాయి. ‘ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్’ను ‘ఫీజుల నియంత్రణ కమిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుత విధానంలో ఉన్నత విద్య కోర్సుల ఫీజుల ఖరారు, అనంతరం కాలేజీల్లో సౌకర్యాలపై పర్యవేక్షణ అధికారాలు కమిషన్‌కు ఉన్నాయి. ఇందులో కొన్ని లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫీజుల ఖరారు సమయంలో కమిషన్‌కు ఉన్న విస్తృత అధికారాల దృష్ట్యా ప్రభుత్వ పాత్ర పరిమితంగా మారింది. దీనిని కాలేజీ యాజమాన్యాలు తొలి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అసలు ఈ కమిషన్‌కు ఫీజుల ఖరారు అధికారమే లేదంటూ కొన్ని యాజమాన్యాలు హైకోర్టులో చాలెంజ్ చేశాయి. అలాగే, ఫీజుల ఖరారు సమయంలో కమిషన్ పెడుతున్న నిబంధనలు తలనొప్పిగా మారాయంటూ వాదిస్తున్నాయి. మరోవైపు ఫీజులు ఖరారు చేసేటప్పుడు ప్రభుత్వం ఏవైనా మార్పులు చేయాలంటే.. తిరిగి కమిషన్‌కు పంపడం తప్ప మరో మార్గం లేదు. అప్పుడు కూడా కమిషన్ మారిస్తేనే ఫీజుల్లో మార్పులు వస్తాయి. దీనిపై అన్నివైపుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కమిషన్ అధికారాలను కొంతమేర పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యల ఫలితంగా పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తెలంగాణతో సహా అనేక రాష్ర్టాల్లో ‘అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ’లే ఉన్నాయి. గతంలో ఏపీలోనూ ఏఎ్‌ఫఆర్‌సీనే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఏఎ్‌ఫఆర్‌సీని ‘ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్’గా మార్చింది. ఈ కమిషన్ అన్నిరకాల ఉన్నత విద్య కోర్సులకు ప్రతి మూడేళ్లకు ఒకసారి ఫీజులు ఖరారు చేస్తుంది. ఫీజుల ఖరారుకు కొన్ని ప్రామాణికాలను నిర్దేశిస్తుంది. అయితే ఈ కమిషన్‌కు ఫీజులు ఖరారు చేసే అధికారమే లేదనేది కాలేజీ యాజమాన్యాల వాదన.