ఉమీద్‌లో రెండు కొత్త మాడ్యూళ్లు
ABN , Publish Date - Feb 01 , 2026 | 05:03 AM
వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణకు కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ...
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కేంద్రం మరో కీలక ముందడుగు
న్యూఢిల్లీ, జనవరి 31(ఆంధ్రజ్యోతి): వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పరిరక్షణకు కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. పారదర్శకత, జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ ఉమీద్ పోర్టల్‌లో మరో రెండు కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. ‘సర్వే మాడ్యూల్’ , ‘వక్ఫ్ ప్రాపర్టీ లీజ్ మాడ్యూల్’ అనే రెండు అదనపు విభాగాలను శనివారం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వక్ఫ్ ఆస్తుల సర్వేకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి, నిర్వహించడానికి, ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి సర్వే మాడ్యూల్ ఒక సమగ్ర డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. అలాగే, వక్ఫ్ ఆస్తుల లీజు ప్రక్రియను మొదటి నుంచి చివరి వరకు డిజిటల్ పద్ధతిలో నిర్వహించేందుకు వక్ఫ్ ప్రాపర్టీ లీజ్ మాడ్యూల్‌ను రూపొందించారు. లీజు కాలపరిమితి, లీజు మొత్తం, ఇతర ముఖ్యమైన వివరాలను పారదర్శకంగా పర్యవేక్షించడానికి ఇది సహాయపడుతుంది.