మందులకు 55.5 కోట్లు
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:31 AM
‘ప్రభుత్వాస్పత్రుల్లో డిమాండ్‌కు సరిపడా మందులు లేవు. సీడీఎస్‌ల్లో కేవలం 290-300 రకాల మందులే ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అయిపోతాయి.
‘ఆంధ్రజ్యోతి’లో ‘మందులు కావాలి’ కథనంతో అధికారుల్లో కదలిక
ఉదయం టెలికాన్ఫరెన్స్.. మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్
ఆస్పత్రుల నుంచి మందుల డిమాండ్‌కు 3 రోజుల గడువు
జిల్లాల్లో సరిపడా మందులు లేవని సీడీఎస్ నిర్ధారణ
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ‘ప్రభుత్వాస్పత్రుల్లో డిమాండ్‌కు సరిపడా మందులు లేవు. సీడీఎస్‌ల్లో కేవలం 290-300 రకాల మందులే ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అయిపోతాయి. ఆ తర్వాత ఏమీ చేయలేం’ అని సెం ట్రల్ డ్రగ్స్ స్టోర్ (సీడీఎస్) సిబ్బంది తేల్చి చెప్పేశారు. 10-15 రోజుల్లో మందుల సరఫరా చేయకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘మందులు కావాలి’ శీర్షికన సోమ వారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల్లో కదలిక తీసుకొచ్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసుకున్న ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సోమవారం ఆగమేఘాల మీద సవరించిన బడ్జెట్ కేటాయింపులు విడుదల చేశారు. తొలుత డీఎంఈ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలుకు రూ.32 కోట్ల ఇచ్చిన అధికారులు సోమవారం ఉదయం దాన్ని రద్దు చేశారు. మధ్యాహ్నానికి రూ.55.5 కోట్లకు సవరించిన బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఆర్డర్ ఇచ్చా రు. మొత్తానికి ‘ఆంధ్రజ్యోతి’ కథనం సంచలనం రేపడంతో.. ఉన్నతాధికారుల్లో కదలిక వచ్చింది. జిల్లాల్లోని అధికారులతో ఉదయం నుంచి టెలికాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించిన ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిపై ఆరా తీశా రు. ఈ క్రమంలో ‘ఆంధ్రజ్యోతి’ కథనంలోని విషయాలు వాస్తవమని తేల్చారు. దీంతో ముందుగా డీఎంఈ ఆస్పత్రుల్లో మొదటి క్వార్టర్‌లో మందుల కొరత లేకుం డా చూసేందుకు బడ్జెట్ కేటాయింపులు పెంచారు. అలానే సవరించిన బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఆస్పత్రుల నుంచి డిమాండ్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆస్పత్రుల్లో స్టోర్ విభాగాలకు మూడు రోజుల సమ యం ఇచ్చారు. ఆస్పత్రుల నుంచి వ చ్చిన డిమాండ్ ప్రకారం ఏపీఎంఎస్‌ఐడీసీ డ్రగ్స్ విభాగం అధికారులు పర్చేస్ ఆర్డర్లు ఇస్తారు.
మాయ మాటలతో బురిడీ..
ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీఎంఎ్‌సఐడీసీ (ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్) అధికారులు మళ్లీ మాయ మాటలతో బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. సీడీఎ్‌సల్లో పది రోజుల్లో మందుల సంఖ్యను పెంచుతామని, ఫిబ్రవరిలో ఇచ్చిన ఆర్డర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాస్తవానికి కంపెనీల కు పర్చేస్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత మందుల సరఫరాకు 75 రోజులు పడుతుంది. ఫిబ్రవరి 26న కార్పొరేషన్ అధికారులు పీవోలు ఇచ్చారు. వాటికి సంబంధించిన మందులు మే 10 నాటికి సీడీఎ్‌సలకు వస్తాయి. ఆ మందులను 15-20 రోజుల పాటు క్వారంటైన్‌లో పెట్టిన తర్వాత బ్యాచ్‌ల వారీగా శాంపిల్స్ తీసి, టెస్టింగ్‌కు పంపిస్తారు. ఈ ప్రక్రియకు దాదాపు 15 రోజులపైనే పడుతుంది. ఆ తర్వాతే ఆస్పత్రులకు పంపిస్తారు. ఈ లెక్కన మే నెలాఖరు వరకూ ఆస్పత్రులకు పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. కానీ కార్పొరేషన్‌లోని డ్రగ్స్ విభాగం అధికారులు 10 రోజుల్లో మందులు వచ్చేస్తాయంటూ తప్పుదారి పట్టిస్తున్నారు.