ఆ రిజర్వ్ ఫారెస్ట్ భూముల స్వాధీనం!
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:57 AM
రిజర్వ్ ఫారెస్ట్ భూముల స్వాధీనంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీయేతర ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు కేటాయించిన, ఆక్రమణలకు గురైన భూములను ....
జిల్లా స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు
ఉత్తర్వులు జారీ చేసిన అటవీ శాఖ
అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): రిజర్వ్ ఫారెస్ట్ భూముల స్వాధీనంపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అటవీయేతర ప్రయోజనాల కోసం ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు కేటాయించిన, ఆక్రమణలకు గురైన భూములను పరిశీలించి, వాటిని స్వాధీనం చేసుకునేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగింది. ఇందుకోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్)ను ఏర్పాటు చేసింది. స్వాధీనం చేసుకున్న రిజర్వ్ ఫారెస్ట్ భూముల్ని అటవీకరణకు ఉపయోగించేలా చూసేందుకు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా స్థాయిలో బృందంలో చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్‌ను, మెంబర్ కన్వీనర్‌గా జిల్లా లేదా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ లేదా ఇన్‌స్పెక్టర్ ఫర్ సర్వేను సభ్యులుగా నియమించింది. అలాగే రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందం చైర్మన్‌గా ఆర్డీవో, సభ్యులుగా డీఎస్పీ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఫర్ సర్వే మెంబర్ కన్వీనర్‌గా సంబంధిత ప్రాధేశిక సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారె్‌స్టను నియమించింది.
రిజర్వు భూములపై సుప్రీం ఆదేశాలివే
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రెవెన్యూశాఖ ఆధీనంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూమిని అటవీయేతర అవసరాలకు మళ్లించారా? ఏవైనా సంస్థలు, వ్యక్తులకు కేటాయించారా? ఆక్రమణలో ఉన్నాయా? అనేది పరిశీలించి, అలాంటి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, విస్తృత ప్రజా ప్రయోజనాలకు అనుకూలంగా అవి లేవని తేలితే, ఆ భూమి విలువను సదరు వ్యక్తులు, సంస్థల నుంచి వసూలు చేసి, అడవుల అభివృద్ధికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతేడాది మే నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వ్ ఫారెస్ట్ భూముల స్వాధీన ప్రక్రియ ఏడాదిలోగా పూర్తి చేసి, తర్వాత ఆ భూముల్ని కేవలం అటవీకరణకు ఉపయోగించేలా చూడటానికి డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించింది. ఆ మేరకు ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది.