దాహమని నీళ్లడిగి.. మెడపై కత్తిపెట్టి..!
ABN , Publish Date - Apr 03 , 2026 | 05:30 AM
ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల కామాంధుడు కర్కశంగా ప్రవర్తించాడు. దాహంగా ఉందంటూ తలుపుకొట్టి.. నీరు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించాడు..
ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి అత్యాచారం
జననాంగంలోకి చువ్వతో చిత్రహింసలు
మాచర్లలో అమానుష ఘటన
మాచర్ల, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల కామాంధుడు కర్కశంగా ప్రవర్తించాడు. దాహంగా ఉందంటూ తలుపుకొట్టి.. నీరు తెచ్చేందుకు ఆమె లోపలికి వెళ్లగానే దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించాడు.. మెడపై కత్తి పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఆమె జననాంగంలోకి ఇనుప చువ్వ నెట్టి చిత్రహింసలకు గురిచేశాడు. పల్నాడు జిల్లా మాచర్లలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ కథనం ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన మహిళ మాచర్ల పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఏడాది కాలంగా స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగా అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం సాయంత్రం 50 యేళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి దాహంగా ఉందంటూ ఆమె ఇంటి తలుపుకొట్టాడు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ఆ ఉద్యోగిని.. నీరు తెచ్చేందుకు తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా.. ఆ ఆగంతుకుడు ఆమె వెనకాలే ఇంట్లోకి జొరపడి గొంతుపై కత్తిపెట్టాడు. చంపేస్తానంటూ బెదిరించి, ఆమె చేతులను వెనక్కి కట్టి నగ్నంగా చేసి అత్చారానికి పాల్పడ్డాడు. అతని బారి నుంచి తప్పించుకునేందుకు తనకు ఎయిడ్స్ ఉందనడంతో కోపోద్రిక్తుడై ఆమె జననాంగంలోకి ఇనుప చువ్వను చొప్పించి వెళ్లిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి తేరుకొని కేకలు వేయగా స్థానికులు ఆమెను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు చేర్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు నరసరావుపేటకు రిఫర్ చేశారు. పోలీసులు బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి
మహిళపై జరిగిన అత్యాచార ఘటనపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా స్పందించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఫోన్ ద్వారా విషయం చెప్పి.. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలికి అండగా ఉంటామన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసే కూటమి ప్రభుత్వంలో.. వారికి హాని చేయాలని చూసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.